Denduluru : బూతుల వీడియో వైరల్.. చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబు వార్నింగ్..!
Denduluru : చింతమనేని ప్రభాకర్.. ఏలూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆ ఫైరే ఇప్పుడు తిప్పలు తెచ్చిపెట్టింది. అధినేతతో అక్షింతలు పడేలా చేసింది. రాజకీయ ప్రత్యర్థి కారు డ్రైవర్‌ను తిట్టిన వీడియో వైరల్ కావడంతో.. చంద్రబాబు మందలించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా చింతమనేని ప్రభాకర్ ఓ వ్యక్తిని బూతులు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఇష్యూ పోలీసు కేసుల వరకు వెళ్లింది. అటు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ క్లారిటీ ఇవ్వడానికి సీఎం వద్దకు రాగా.. అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఏం జరిగింది..
ఇటీవల చింతమనేని ప్రభాకర్ ఓ శుభకార్యానికి వెళ్లారు. ఆయన వెళ్లడానికంటే ముందే.. తన రాజకీయ ప్రత్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి అక్కడ ఉన్నారు. అయితే.. ఫంక్షన్ హాల్‌కు వెళ్లే దారిలో అబ్బయ్య చౌదరి కారు ఉంది. తన కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదంటూ.. చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి వచ్చి డ్రైవర్‌ను చెప్పలేని బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చంద్రబాబుకు వివరించేందుకు..
దీని గురించి చంద్రబాబుకు వివరించేందుకు ప్రభాకర్ శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఉద్దేశపూర్వకంగా, ఘర్షణకు పురిగొల్పేలా వైసీపీ నేతలే ప్రవర్తించారని చంద్రబాబుకు వివరించారు. అయితే.. ప్రభాకర్ తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
సీఎం వార్నింగ్..
'మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. సహనంతో వ్యవహరించాలి. మీరు ఇలా మాట్లాడితే ఎలా. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి' అని చంద్రబాబు చింతమనేని ప్రభాకర్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఈ ఘటనపై ప్రభాకర్ మీడియా ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన కారు వెళ్లడానికి వీల్లేకుండా వారు వాహనాన్ని అడ్డు పెట్టారని చెప్పారు. కారు తీయాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదన్నారు.
చింతమనేని వెర్షన్..
'నా డ్రైవర్, గన్‌మెన్, నేను కారులో వస్తున్నాం. ఈ క్రమంలో వారి కారు అడ్డుగా ఉంది. కారును పక్కకు తీయాలని నా డ్రైవర్ మూడుసార్లు చెప్పారు. ఫంక్షన్ హాల్ సెక్యూరిటీ వాళ్లతో చెప్పించారు. అయినా తీయలేదు. అప్పుడు నేను కారు దిగి వెళ్లి కేకలు వేశా. నేను మాట్లాడుతుండగా వీడియో తీశారు. కావాలనే ఇదంతా చేశారు. దీనికి సంబంధించిన వీడియో నా కారు కెమెరాలో రికార్డ్ అయ్యింది. కావాలంటే ఇస్తా' అని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
జగన్ రియాక్షన్..
'దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టారు. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?' అని జగన్ ప్రశ్నించారు.