పొలిటికల్ కరప్షన్, ఆఫీసర్ కరప్షన్ ఎట్టి పరిస్థితిలోనూ వద్దు.. ఈ విషయంలో మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. ఈ సమయంలో కొందరు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదని సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
'పాస్టర్ ప్రవీణ్ అంశంలో జరిగిన ప్రచారంపై ఇంకా గట్టిగా స్పందించాలి. గోవుల మరణాలు అంశంపై కూడా జనంలోకి వాస్తవాలను తీసుకెళ్లాలి. మత పరమైన అంశాలు కాబట్టి.. ఎలాంటి వివాదాలు లేకుండా స్పందించాలి. తిరుపతిలో గోవుల మృతిపై వైసీపీ అసత్య ప్రచారాన్ని తీపి కొట్టడంలో మంత్రులు విఫలమయ్యారు. దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తుంటే.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. జిల్లాలు యూనిట్‌గా తీసుకొని.. మంత్రులు సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి బలంగా తీసుకెవెళ్లాలి. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదు. వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు చేస్తున్న తప్పులు.. ప్రభుత్వంపై పడుతున్నాయి. వాటిని సరిదిద్దుకోండి' అని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది.
1.ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2.రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది.
3.స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది.
4.పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
5.విశాఖలోని ఐటీ హిల్ -3 పైన టీసీఎస్‌కు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
6.ఉరుస క్లస్టర్ కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపు.
7.బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై.. ఒడిశా పవర్ కన్సార్టియమ్ కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం.
8. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
9.వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తయ్యేలా పని చేయాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ఈనెల 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదురోజుల పాటు చంద్రబాబు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు 75వ బర్త్‌డే ఉంది. వజ్రోత్సవ జన్మదినోత్సవం సందర్భంగా..కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు.
సంబంధిత కథనం