Opinion: బాబే మారెనా...? ప్రజలనేమారెనా??-chandrababu naidu claims transformation skepticism persists without external validation opinion by dileep reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Opinion: బాబే మారెనా...? ప్రజలనేమారెనా??

Opinion: బాబే మారెనా...? ప్రజలనేమారెనా??

HT Telugu Desk HT Telugu
Jun 19, 2024 03:47 PM IST

Opinion: ‘మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు..’ - పీపుల్స్ పల్స్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి విశ్లేషణ.

Tirumala: జూన్ 13న తిరుమలలో మీడియాతో మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Tirumala: జూన్ 13న తిరుమలలో మీడియాతో మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (PTI)

‘మారింది మారింది కాలం… మారింది మారింది లోకం...

ఎక్కడ మారిందమ్మా...? ఇంకా దిగజారిందమ్మా….!’

అనే సినీ గీతమొకటి.. డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును చూస్తారు’ అని భరోసా కూడా ఇస్తున్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా కూటమిని 164/175 సీట్ల గెలుపుతో విజయతీరాలకు నడిపించిన బాబు, ఫలితాల తర్వాతే ఈ ‘మారిన మనిషి’ పల్లవి అందుకున్నారు. కానీ, ఆచరణలో ఆ మార్పు వచ్చినట్టు ఏమీ కనిపించడం లేదు. పైగా విరుద్ధ సంకేతాలున్నాయి. ప్రకటన చేసినా... మాటల్లో, చర్యల్లో, వ్యవహారంలో ఇంకా మునుపటి చంద్రబాబునాయుడే తొంగి చూస్తున్నట్టుంది.

లోగడ పలుమార్లు ఆయన ‘మారానని..., మారిన మనిషిన’ని చెబితే నమ్మేవాళ్లు నమ్మారు. నమ్మి మోసపోయిన వారున్నట్టే నమ్మక నయమైన వారున్నారు. కొందరైతే ఆయన్ని ఇప్పటికీ, ఎప్పటికీ నమ్మరు. ఇదంతా విశ్వసనీయతకు సంబంధించిన అంశం. అక్కడ ఆయన కొంచెం పూర్! మారానని చంద్రబాబు చెబుతున్నారంటే... మార్పు అవసరమనో, అనివార్యమనో ఆయన గ్రహించినట్టే లెక్క! మరి, ఆ మార్పు నిజంగా ఉందా? అన్నది ప్రశ్న. గతంతో పోలుస్తూ వర్తమానంలో ఆయన వ్యవహారశైలి, ప్రవర్తనను పరిశీలిద్దాం.

పరస్పర విరుద్దవైఖరి

‘మేము ఎవరిపైనా కక్షసాధింపులకు పాల్పడం’ అంటూనే మరోపక్క నాయకులు, అధికారుల్ని టార్గెట్ చేసుకొని వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి, కొందరు అధికారుల విపరీత వైఖరిని నిలువరించడానికి లోకేశ్ తన పాదయాత్ర సమయంలో ‘రెడ్ బుక్’ చూపిస్తూ హెచ్చరికలు చేస్తే చేసి ఉండవచ్చు. కానీ, ఇప్పుడాయన బాధ్యత కలిగిన మంత్రి. ఆయన తండ్రి చంద్రబాబు స్వయానా ముఖ్యమంత్రి. రాష్ట్ర అధికార వ్యవస్థ అంతా వారి చెప్పుచేతల్లోనే పనిచేయాలి. ఇప్పుడా రెడ్ బుక్ సంస్కృతేంటి? ఇటువంటివి ఉపేక్షించడమే తప్పంటే, ఇక చట్టవిరుద్దమైన సదరు పోస్టర్లు, ప్లెక్సీలు, హోర్డింగ్లను ప్రాత్సహించడమేంటి?

కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఉన్నతాధికారులతో దురుసుగా, అహంకారంగా వ్యవహరించి, వారిని కించపరచి పంపడమేంటి? ఫలానా అధికారులపై నమ్మకం, విశ్వాసం, చివరకు ఇష్టం లేకపోతే... వారికి కీలకమైన బాధ్యతలు ఇవ్వకుండా అప్రాధాన్యమైన పోస్టింగులు ఏవో ఇవ్వొచ్చు. ప్రభుత్వాధినేతకుండే ఆ విస్తృతాధికారాలను ఎవరూ ప్రశ్నించరు, తప్పుబట్టరు. కానీ, మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల్ని తలుపు బయట నుంచే వెనక్కి పంపించడం, బొకేలు ముట్టీముట్టనట్టు చేసి, తిరిగి వారి మొఖాన్నే కొట్టడం, అటువైపే చూడకుండా ముఖం చిట్లించడం.... ఇవన్నీ మారిన మనిషి అనడానికి సంకేతాలా? కక్ష సాధింపులకు మరో రూపం కాదా? ఇలా అవమానాలకు గురైన వారంతా కూడబలుక్కుని లోలోన వ్యతిరేకిస్తే, సర్కారుకు సహాయనిరాకరణ చేస్తే... నష్టపోయేది బాబో, లోకేశో కాదు, నికరంగా రాష్ట్ర ప్రజలు.

ఇక రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న దాడులు, దౌర్జన్యాలు, హింసను ఆపాల్సింది ఎవరు? దృతరాష్ట్ర వైఖరితో... సొంత పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికి సదరు ఉన్మాదచర్యల్ని కావాలనే ఉపేక్షిస్తున్నారా? తెలిసీ ప్రోత్సహిస్తున్నారా? అదీ ప్రజల భద్రతని, ప్రయోజనాల్ని పణంగా పెట్టి! అంటే, పాలకులకు ఏది ముఖ్యం? ప్రజల్ని సంతృప్తిపరచడమా? లేక వారి భద్రతను గాలికొదిలి, కేవలం పార్టీ నాయకులు-కార్యకర్తల్ని సంతృప్తిపరచడమా? ఇదీ సగటు పౌరుడి ప్రశ్న! ఇది తేల్చితే తప్ప, మార్పు వాదం మిథ్య!

బాట పరిచే తీరిదేనా?

అలిపిరి దుర్ఘటన తర్వాత... తనది పునర్జన్మ అన్నారు చంద్రబాబునాయుడు. అనంతర ఎన్నికల్లో అలాగే ఓటడిగారు. కానీ, గతాన్ని మరువని ప్రజలు ఆయన్ని శిక్షించారు. తర్వాత, ఆయన కోరినట్టే మళ్లీ ఒక అవకాశం ఇస్తూ 2014లో పట్టం కట్టారు. అదే ప్రజలు మళ్లీ (2019) శిక్షించేలా ఆయన వ్యవహరించారు. చివరి ఎన్నికలు, చివరి అవకాశం అని.... ప్రజల వద్దకు వెళ్లి, ఇప్పుడు (2024) మళ్లీ వారి దీవెన పొందారు. ఈ లోపున.... బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని ఒకసారి, దేశానికి ఏకైక దిక్కని మరోసారి ఇలా రెండు నాల్కలు సాచారు. మోదీని.... తిట్టి-పొగిడి మళ్లీ తిట్టి-పొగిడారు.

రాజకీయంగా, విధానాల రీత్యా, వ్రవర్తన-వ్యవహారశైలి పరంగా గడియారంలో లోలకంలా బాబు ఆ కొస నుంచి ఈ కొసకు వస్తూ-పోతుంటారు. మరందుకే, తరచూ ‘మారిన మనిషిని’ అంటున్నారేమో తెలియదు! మారడమంటే, లోగడ ఏవైనా తప్పులు జరిగుంటే, వాటిని గ్రహించి, సరిదిద్దుకొని... ఇకపై వాటిని మళ్లీ చేయకుండా బుద్దిగా ప్రవర్తించడం అనుకుంటారు ఎవరైనా! కానీ, చంద్రబాబునాయుడు అలా కాదు. ‘ముసలి పులి-బంగారు కంకణం’ కథలో లాగా పబ్బం గడిచే దాక ఒకలాగా, తర్వాత మరోలాగా వ్యవహరిస్తారనే పేరుంది.

పచ్చి బూతులు తిట్టిని నాయకులను కూడా ‘అవసరార్థం’ రాజకీయంగా క్షమిస్తుంటారు. టిక్కెట్లివ్వడమే కాదు, పిలిచి మంత్రివర్గంలోనూ చేర్చుకుంటారు. మరి, అధికారుల విషయంలో ఎందుకో భిన్నంగా ఉంటారు. 1995-2004 ఆయనకు ‘బ్లూఎయిడ్ బాయ్’లాగా పనికొచ్చిన ఓ అధికారి... అధికారం మారాక ప్రత్యర్థి పాలకులకు కాస్త సన్నిహితంగా వెళ్లేసరికి, ఇప్పుడాయన ముఖం చూడ్డానికి కూడా చంద్రబాబు అంగీకరించడం లేదు. ‘ఇదేం వైఖరి?’ అని జనం విస్తుపోతున్నారు. ‘తనతో ఉంటే ఒకనీతి, ఇతరులకు సన్నిహితమైతే మరోనీతి’ అంటే ఎలా? తన అధ్యాయం ఎలాగూ ముగుస్తోంది. తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు బాటలు పరిచే పనిలో ఉన్న చంద్రబాబు, రేపు ఇవన్నీ నికరంగా ఎవరికి నష్టం చేస్తాయన్నది ఆలోచించాలి!

కలగాపులగం సరికాదు!

రాజకీయ నాయకులతో అధికారిక వ్యవహారాలు, అధికారులతో ఫక్తు రాజకీయ కార్యకలాపాలు చేయిస్తూ అంతా కలగాపులగం చేయడం బాబు పద్దతుల్లో ఒకటి. మొదట్లో ఇది కొంత పనిచేసినా... రాను రాను బెడిసింది. ఫలితాలు నాశిరకంగానే ఉన్నాయి. నాయకుల సంగతెలా ఉన్నా, అధికారుల్ని అధికారులుగానే ఉంచాలి. గతంలో సతీశ్ చందర్, కుటుంబరావు, పరకాల ప్రభాకర్ వంటి వారి సేవల్ని చంద్రబాబు వాడుకున్న తీరును ప్రజలు సహజంగానే మరచిపోరు. టెలి-వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి, గంటలు గంటలు బాబు ప్రసంగాలు చేయడాన్ని అధికారులు ఎట్లా స్వీకరిస్తారో ఒక ప్రధానస్రవంతి జర్నలిస్టుగా నేను స్వయంగా చూశాను. నిజానికి, ఆ సాంకేతిక సహకారం పొంది, తాము ఆశించే పాలన-రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవాలి తప్ప, ఎక్కువ గంటలు అందరినీ లైన్లో ఉంచితే, వ్యవస్థ తన గుప్పెట్లో ఉంటుందనుకోవడం ఒట్టి భ్రమ!

ఇక కొన్ని ఆరంభశూరత్వాలు మన తెలుగు సమాజంలో సహజమే! ‘నేను దారంట వెళుతుంటే ట్రాఫిక్‌ను ఆపొద్దు’ అని పలువురు ముఖ్యమంత్రులు మొదట హూందాగా ప్రకటిస్తారు. ఆరంభంలో చక్కగానే పాటిస్తారు. ఆ మోజైనా, ఆచరణైనా కొన్నాళ్లవరకే.... తర్వాత సాధ్యపడదని పోలీసులు చేతులెత్తేస్తారు. అధినేతలూ కిమ్మనరు. కథ మళ్లీ మొదటికొస్తుంది. చంద్రబాబు జన్మభూమి-ప్రజలవద్దకు పాలన ప్రారంభించినపుడు మెదక్ జిల్లా ములుగులో ముచ్చటగా మూడు హామీలిచ్చారు. బస్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్, పీహెచ్సీ ఏర్పాటు. ఏమైందో? చిత్రమేమంటే, 4 సంవత్సరాలైనా అందులో ఒక్కటీ ముట్టుకోలేదు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్ విలేకరులను అక్కడికి తీసుకువెళ్లి ఎండగట్టింది.

మళ్లీ ఇటువంటి, ‘అసలుపని జరుగని కొసరు ఆర్భాటాలు’ పెరిగే సూచనలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎల్లో-బ్లూ మీడియాలుగా ఏపీలో ప్రసారమాధ్యమ రంగం నిలువునా చీలి ఉన్న విలక్షణ కాలమిది. ‘ఎల్లో మీడియా’ను నమ్ముకొని బాబు 2019లో నిలువునా మునిగితే, ‘బ్లూ మీడియా’పైనే ఆధారపడి జగన్మోహన్రెడ్డి 2024 లో నట్టేట మునిగారు. మారానంటున్న బాబు, అప్పుడే మీడియా మీద ఆంక్షలు...సాక్షి, ఎన్టీవీ, టెన్టీవీ, టీవీ9... ఇలా నిషేధాల పర్వం మొదలైంది. ఇదేం తీరు?

ఒక్క వైఎస్సార్కే చెల్లింది

ముఖ్యమంత్రి హోదాలో ఉండి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... ఇతర ప్రజాప్రతినిధులనే కాకుండా సామాన్యప్రజానీకానికి కూడా విరివిగా, తేలిగ్గా అందుబాటులో ఉన్న నాయకుడంటే మొదట వైఎస్.రాజశేఖరరెడ్డి పేరే గుర్తొస్తుంది. తానెంత బిజీగా ఉన్నా... ఆయన అలా సమయం కేటాయించే వారు. ఉదయం క్యాంప్ ఆఫీస్లో అరగంటో, గంటో ఆ పైనో... వినతులతో తనను కలిసే సామాన్య ప్రజలకు ఆయన అందుబాటులో ఉండేది. ఆరుబయట క్యూలోనే కాకుండా లోపల వివిధ హాళ్లలో ఉండే సందర్శకులనూ, అధికారుల్ని వెంటబెట్టుకొని వైఎస్సార్ కలిసేది. మధ్యాహ్నం భోజనం తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందస్తు అపాయింట్మెంట్ లేకున్నా నేరుగా, ఇతర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తగిన ముందస్తు అపాయింట్మెంట్తో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దాదాపు రోజూ ఉండేది.

ఈ పని ఇంత వెసలుబాటుతో చంద్రబాబే కాదు, జగన్మోహన్రెడ్డి చేయలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావూ చేయలేదు. చంద్రబాబు కనీసం 1995-2004 కాలంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో భేటీలు జరిపేది. కొంతమేర సంప్రదింపులు చేసేది. ‘పొలిట్ బ్యూరో సమావేశాలు పెట్టి కీలకాంశాలపై చర్చలు సాగించేది. అందులో కొంత సాగతీత ఉండేది. తర్వాతి కాలంలో ఈ ప్రక్రియ క్రమంగా సన్నగిల్లింది.

‘మారిన మనిషి’ అనిపించుకోవడానికి.... ఈ ప్రక్రియను పునరుద్దరించవచ్చు. ఎంతో కొంత సమయం నిరంతరం ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కేటాయించడం ద్వారా తమ పాలనపై ప్రజాస్పందన ఎలా ఉంది? ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతోంది? అన్నది పాలకులకు తెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది అత్యవసరమే! అలా ఎప్పటికప్పుడు పనితీరును సంస్కరించుకుంటూ మెరుగైన పాలన అందించే ఆస్కారం ఉంటుంది. కూటమి మిత్రపక్షాలను విశ్వాసంతో వెంట తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. అప్పుడు... ‘మారిన మనిషిని’ అంటే, దానికో అర్థం, పర్థం, పరమార్థం ఉంటాయనేది జనవాక్కు!

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802

దిలీప్‌రెడ్డి, పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,
దిలీప్‌రెడ్డి, పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, వ్యూహాలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

WhatsApp channel