AP Health University: మళ్లీ వస్తాం… పేరు మారుస్తామన్న చంద్రబాబు
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్టీఆర్ పేరుమార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.మళ్లీ అధికారంలోకి వచ్చాక పేరు మారుస్తామని స్పష్టం చేశారు.
chandrababu fires on ysrcp govt: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీలో హాట్ హాట్ గా మారింది. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహానేత అయిన ఎన్టీఆర్ పేరు మార్చటం సరికాదని అంటున్నారు. ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కుటుంబం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు బీజేపీ, జనసేనతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
హెల్త్ వర్శిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం టీడీపీ అధినేత చంద్రబాబు నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో మాట్లాడిన ఆయన... ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పేరు మారుస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం దారుణమన్న ఆయన.. సీఎం జగన్ నీచబుద్ధి బయట పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. తాను తలచుకుంటే కడప జిల్లాకు, ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఆ పేరు ఉండేదా..? అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్‌లా ఏనాడూ ఆలోచించలేదన్న ఆయన.. మహానుభావుల పేర్లు తొలగించడం ఏమిటి? అని చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అసలు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్‌ఆర్‌కు ఏం సంబంధం? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్రకటన..
ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ పేరు మార్పుపై నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ యూనివర్శిటీకి ఎన్టీఆరే మూలకారకుడు అని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై స్పందిస్తూ నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రకటన విడుదల చేసింది. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం దురదృష్టకరమని... ఇది తెలుగుజాతిని అవమానించినట్లే అని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహానాయకుడు ఎన్టీఆర్. ఆయన యుగపురుషుడు అని ప్రస్తావించారు. నందమూరి రామకృష్ణ పేరిట ఈ ప్రకటన విడుదలైంది.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం దుర్మార్గమన్నారు నారా లోకేశ్. అసలు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.సర్కార్ నిర్ణయంపై పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇక వర్శిటీ పేరు మార్పునకు సంబంధించిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1996లో ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా బిల్లుకు ఆమోదముద్ర పడటంతో...వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మారనుంది.
సంబంధిత కథనం