Telugu News  /  Andhra Pradesh  /  Chandrababu Comments On Cm Jagan In Kurnool
కర్నూలులో చంద్రబాబు
కర్నూలులో చంద్రబాబు

Chandrababu In Kurnool : నేను సినిమా యాక్టర్ కాదు.. నా సినిమా సూపర్ హిట్ కాలేదు

17 November 2022, 16:05 ISTHT Telugu Desk
17 November 2022, 16:05 IST

Chandrababu On Jagan : రాష్ట్రానికి సీఎం జగన్ శని గ్రహంలా మారారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నీ ఆపేశారని, అభివృద్ది నిలిపివేశారని విమర్శించారు.

కర్నూలు జిల్లాలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటిస్తున్నారు. ఆదోనిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెళ్లి సంబంధం చూడాలి అంటే అన్నీ చూస్తామని, కానీ నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయారని చంద్రబాబు విమర్శించారు. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారన్నారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని, రౌడీయిజం పెరిగిపోయిందని, దోపిడీ, నేరాలు పెరిగిపోయాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు

'రాయదుర్గం(Rayadurgam) నియోజకవర్గంలో ఓ కుటుంబ వివాదాన్ని కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. ఎందుకు పోలీసు వ్యవస్థ ఇలా అయ్యింది? జగన్ రెడ్డి ఊరికో సైకోను సిద్ధం చేశాడు. వాళ్లు నన్ను ఏమీ చెయ్యలేరు. మా క్యాడర్ తిరగబడితే ఏం చేస్తారు? పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. పోలీసు(Police)లకు జీతాలు రావడం లేదు. మీ పిల్లలూ నష్టపోయారు. నేనేమీ సినిమా(Cinema) యాక్టర్ కాదు.. నా సినిమా సూపర్ హిట్ కాలేదు. కానీ జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టీడీపీ(TDP) రావాలని మీరంతా వచ్చారు.' అని చంద్రబాబు అన్నారు.

తన కర్నూలు పర్యటన(Kurnool Tour)లో వైసీపీ చోటా నేతలు వేషాలు వేస్తే.. పోలీసులు చూస్తూ కూర్చున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే తన బాధ్యత కాదని, ఆపై మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపైనా వైసీపీ(YSRCP) ప్రభుత్వం బాదుడే బాదుడు అని టీడీపీ అధినేత ఆరోపించారు. చెత్తమీద పన్ను వేసే ముఖ్యమంత్రిని ఏమనాలి అని అడిగారు. మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైనా పన్ను వేస్తోంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దొరుకుతా ఉందా అని, ఈ ఊళ్లో ఇసుక కర్నాటక, హైదరాబాద్లో దొరుకుతుందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా.. ఏం చేస్తున్నారు. సాయంత్రానికి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) పై ఒకరు వార్తను ఫార్వర్డ్ చేస్తే సీఐడీతో అరెస్టు చేయించారు. మద్యం మాఫియాతో జగన్ దోపిడీ చేస్తున్నారు. తయారీ ఆయనే...అమ్మకం ఆయనే. ప్రకాశం(prakasam) జిల్లాలో హవాలా మంత్రి.. కర్నూలులో బెంజి మంత్రి. ఇదీ జగన్ క్యాబినెట్(Cabinet). ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము చాలడం లేదు. నకిలీ విత్తనాలతో పత్తి రైతులను ముంచారు. నాడు తప్పు చేస్తే తాట తీస్తాను అని భయం ఉంది కాబట్టి అక్రమాలకు అంతా భయపడ్డారు. కానీ నేడు ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు.

వైసీపీ నేతలు ఖనిజ సంపద దోచేస్తున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. చుక్కల భూమిపేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసి ప్రజల ఆస్తులు కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ప్రజలు తమ భూములు ఉన్నాయో పోయాయో చూసుకోవాలి. మూడు రాజధానులు(3 Capitals) అనేది ఎక్కడైనా ఉందా? మీకు మూడు రాజధానులు కావాలా? ఒక్క రాజధాని కావాలా?

పవన్ కళ్యాన్(Pawan Kalyan) విశాఖపట్నం వెళ్తే అక్కడా ఇబ్బంది పెట్టారు. గుంటూరు(Guntur) జిల్లా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట. రేపు మేం కూడా వైసీపీ నేతల ఇళ్లపై రోడ్లు వెయ్యలేమా...ఫ్లైవోవర్ లు కట్టలేమా? విశాఖలో మెడమీద కత్తిపెట్టి భూములు, వ్యాపారాలు రాయించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టీవీ ఛానల్స్ ను జగన్ రెడ్డి రాకుండా చేస్తున్నారు. నేను ఆ రోజు ఇలా చేసి ఉంటే మీ పేపర్, ఛానల్స్ వచ్చేవా?

అన్న క్యాంటీన్(Anna Canteen) ఏం పాపం చేసింది. నా మీద కోపంతో అన్నక్యాంటీన్లను మూసివేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్ లు పెడతాం. నేను సీఎంగా ఉండి ఉంటే పెన్షన్ 3 వేలు అయ్యేది. రూ. 200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసింది టీడీపీనే. టీడీపీ పెట్టిన చాలా పథకాలు నిలిపివేశారు. తెలుగుదేశం బీసీల పార్టీ. వారికి నేను అండగా ఉంటా. ఇంకా యువతలో ఉన్న భయం పోవాలి. మీ ఎమ్మెల్యే కేసు పెడితే ఏమవుతుంది. నా అనుభవం ఉన్నంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు. నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. మరి జగన్ ఎక్కడ చదువుకున్నాడు?