Skill Development Case : చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధం, సెక్షన్ 17ఏ కింద అనుమతి తీసుకోలేదు- న్యాయవాది హరీశ్ సాల్వే
Skill Development Case : స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే హైకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబుపై చట్టవిరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాదనలు వినిపించారు.
Skill Development Case : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో పలు అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‌మాల్ చౌదరి, అర్ణబ్ గోస్వామి కేసులను సాల్వే హైకోర్టులో ప్రస్తావించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద తగిన అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమైనదని వాదించారు. గతంలో వచ్చిన తీర్పులను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారన్నారు. సెక్షన్ 17ఏ పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకొని సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు.
ట్రెండింగ్ వార్తలు
చట్టవిరుద్ధమైన ఎఫ్ఐఆర్
"ఈ ఎఫ్ఐఆర్ పూర్తిగా చట్టవిరుద్ధమని మా వాదన. అడ్వకేట్ జనరల్... గత తీర్పులను తప్పుగా అర్థం చేసుకున్నారు. వారు సెక్షన్ 17A (అవినీతి నిరోధక చట్టం) నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకుని ఫిర్యాదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేందుకు అవసరమైన అనుమతి తీసుకోలేదు. ఈ కేసు విచారణలో చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు. అరెస్టు విషయంపై గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఈ నిబంధనలు పాటించలేదు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రకారం ఫిర్యాదులో ఎలాంటి నేరం లేదని నిర్ధారణ అవుతుంది" - హరీశ్ సాల్వే వాదనలు
కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి
ఈ కేసు కేవలం పన్ను చెల్లింపులకు సంబంధించినదని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే కోర్టుకు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారని, అవి నడుస్తున్నాయన్నారు. ఇన్‌వాయిస్‌లు పెంచి చూపించారన్న అభియోగాలకు అప్పటి సీఎం ఎలా బాధ్యులవుతారని వాదించారు. పన్ను కేసును తీసుకొచ్చి అవినీతి నిరోధక చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ కింద కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. కానీ సీఐడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ మెమో ఆధారంగా చంద్రబాబును నిందితుడిగా చేర్చారన్నారు. అసలు ఈ ఫిర్యాదు ఒక అభూత కల్పన అని వాదనలు వినిపించారు. ఎక్కడా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందన్న ఆధారాలు చూపలేకపోయారన్నారు. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులను అపాయింటెడ్ హంచ్‌మెన్’ అని సీఐడీ అధికారులు ఫిర్యాదులో పేర్కొనడంపై సాల్వే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విలువ సరైందేనని కేంద్ర సంస్థలు చెబుతున్నాయన్నారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థను భాగస్వామి చేయాలి కదా? ప్రశ్నించారు.