AP Nominated Posts : పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక ప్రకటన
AP Nominated Posts : టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీపైనా కీలక ప్రకటన చేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని.. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆదేశించారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

మళ్లీ గెలిచేలా..
'2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలి. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలి. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టాం. ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టండి' అని చంద్రబాబు నేతలకు సూచించారు.
కార్యకర్తలను గౌరవించాలి..
'గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారు. వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయం. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలి. ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపీ అయిపోయాను అని ఎవరూ భావించవద్దు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలి' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
వారికే పదవులు..
'పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లో ఉండాలి. అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలి.ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్‌లో మెంబర్‌గా ఉండాలి. 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తాం. జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తాం. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తాం. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సమస్యలు పరిష్కరించాలి..
'మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తాం. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించాలి. సమస్యలు పరిష్కరించాలి. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పని చేయాలి. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలి. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే' అని సీఎం తేల్చి చెప్పారు.
ప్రజలకు వివరించాలి..
'ప్రజల్లో సంతృప్తి ఉండాలి. భవిష్యత్‌పై నమ్మకం, భరోసా కలగాలి. ఇదే కూటమి ప్రభుత్వ విధానం. ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం.. భవిష్యత్ లో ఏం ఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలి. పథకాలన్నీ ఇస్తాం. వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టండి. ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టాం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తాం' అని చంద్రబాబు వివరించారు.