TDP Cadre Criticism: అత్యుత్సాహమే అసలు సమస్య.. క్యాడర్, సానుభూతిపరుల తీరుతో చంద్ర బాబుకు తలనొప్పులు
TDP Cadre Criticism: టీడీపీ సానుభూతిపరులు, కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చికాకులు తప్పడం లేదు. పార్టీ ప్రతిష్టకు చేటు చేస్తుందని గుర్తించకుండా ప్రభుత్వ నిర్ణయాలపై సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు చేస్తుండటంతో ఇరుకున పడాల్సి వస్తోంది.
TDP Cadre Criticism: తెలుగుదేశం పార్టీ బలం అనుకున్న వారే ఇప్పుడు బలహీనత అవుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీని భుజాన మోసిన వాళ్లంతా ఇప్పుడు తాము కోరుకున్నట్టు చంద్రబాబు చేయడం లేదని నిష్టూరాలు పోతున్నారు. పదవులు ఆశించిన వారు, పనులు చేయించుకోవచ్చని భావించిన వారు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.
టీడీపీలో అసంతృప్తి గళాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలన తహతహలాడిన గొంతులన్నీ సణుగుడు స్వరాలు పెంచుతున్నాయి. టీడీపీ మీద తమకే హక్కు ఉందని, తమ వల్లే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే భావనతో ఎవరికి వారు సోషల్ మీడియాలో స్వరాలు వినిపిస్తున్నారు. ఉన్న వనరులు, సంకీర్ణ రాజకీయాలు, రాజకీయ అవసరాలను బేరీజు వేసుకోకుండా ఎవరికి వారు చంద్రబాబుకు రాజకీయ పాఠాలు చెప్పడానికి రెడీ అవుతున్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే చంద్రబాబు తీరు మీద సణుగుడు మొదలు పెట్టిన తెలుగు తమ్ముళ్లు క్రమంగా బాబు వైఖరిని తప్పు పట్టే స్థాయికి ఎదిగారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తమకు గుర్తింపు రాలేదనే అక్కసు కొందరిది అయితే గత ప్రభుత్వంలో తాము ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇప్పుడు తాము చెప్పిన పని చేయాల్సిందేననే వైఖరి మరికొందరిలో కనిపిస్తోంది. ఈ వైఖరి కాస్త తెలుగుదేశం పార్టీకి అనవసరమైన చిక్కులు తెచ్చి పెడుతోంది.
ప్రభుత్వం ఏర్పాటై కొద్ది నెలలే అయ్యిందని గుర్తించకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరును, చంద్రబాబు వైఖరిపై విమర్శలతో పాటు విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించడం, బాబు వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ఎక్కువైపోయింది. ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియా బృందాల కంటే సొంత పార్టీ క్యాడర్ నుంచి ఈ తరహా విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో లోపాలను వెదికి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను రిటైర్మెంట్ వరకు ఏమి చేయలేరని సంగతి తెలిసినా ఉద్యోగుల పదోన్నతులు,అపాయిట్‌మెంట్‌ల విషయంలో అవసరానికి మించి టీడీపీ సానుభూతిపరులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలానా వారు టీడీపీ వ్యతిరేకులు, వైసీపీ అనుకూలురు, గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టారని వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.
ఇక నామినేటెడ్ పదవుల విషయంలో జరుగుతున్న తాత్సారం కూడా నేతల్ని అసంతృప్తికి గురి చేస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ కోసం పనిచేసిన వారందరికి పిలిచి పదవులు ఇచ్చేస్తారని ఆశించి భంగపడిన వారు చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత కాలం ఎదురు చూడాలని నిలదీస్తున్నారు. అప్పట్లో టీడీపీ ముద్రవేసుకుని కష్టపడ్డామని, ఇప్పుడు టీడీపీ వచ్చినా తమకు కష్టాలు తప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ వైఖరితో అంతిమంగా చంద్రబాబుకు నష్టమని గుర్తించడం లేదు.
సంబంధిత కథనం