AP DSC Notification 2024 : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నోటిఫికేషన్‌కు మరో రెండు నెలలు పట్టొచ్చు!
AP DSC Notification 2024 : ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు మరో రెండు నెలల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమచారం.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యా శాఖ మంత్రి లోకేష్‌ను.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కలిశారు. వీరిద్దరి మధ్య డీఎస్సీ నోటిఫికేషన్ గురించి చర్చ జరిగింది. అయితే.. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, మరో రెండు నెలల సమయం పట్టొచ్చని తనతో మంత్రి లోకేష్ చెప్పినట్లు.. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తొలిత 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల చేస్తామని షెడ్యూల్ చేశారు. నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండటంతో వాయిదా పడింది. ఆ తరువాత నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా నోటిఫికేషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రకటించారు.
అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు మార్గదర్శకాలు విడుదల చేయకుండా, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి లేదని.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తరువాతే, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుకి మంత్రి నారా లోకేష్ వివరించారు.
16 నుంచి ఉచిత కోచింగ్..
డీఎస్సీ అభ్యర్థులకు మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు మంత్రి ఎస్.సవిత. ఈనెల 16 నుంచి బీసీ స్డడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గుంటూరులో డీఎస్సీ కోచింగ్ సెంటర్లను తాను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కోచింగ్ సెంటర్‌లో 200 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇవ్వనున్నామన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామన్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామన్నారు. రెండు నెలల పాటు ఇవ్వనున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో.. నెలకు రూ.1,500 చొప్పున స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. మెటీరియల్ కోసం అదనంగా మరో రూ.1,000 ఇవ్వనున్నామన్నారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో..
ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నామని మంత్రి సవిత వివరించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేశామన్నారు. ఈ యాప్‌లో సబ్జెక్టుల వారీగా నిపుణులైన వారితో క్లాసుల నిర్వహిస్తున్నామన్నారు. క్లాసులతోపాటు ఈ యాప్‌లో పాత క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
బీఈడీ అర్హతతో పాటు టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఆన్ లైన్ అభ్యర్థులకు తమకిష్టమైన సమయాల్లో యాప్‌ను ఓపెన్ చేసుకుని క్లాసులు వినే అవకాశం కల్పించారు. ఆన్ లైన్ కోచింగ్‌తో గృహిణులకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ఏదో ఒకే విధానంలో మాత్రమే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)