Jagan Success In R5 zone: అమరావతి ఇళ్ల నిర్మాణంలో జగన్ సర్కారు మరో ముందడుగు.. అనుమతులిచ్చిన కేంద్రం-central permission granted for construction of houses for poor in amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Central Permission Granted For Construction Of Houses For Poor In Amaravati

Jagan Success In R5 zone: అమరావతి ఇళ్ల నిర్మాణంలో జగన్ సర్కారు మరో ముందడుగు.. అనుమతులిచ్చిన కేంద్రం

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 06:59 AM IST

Jagan Success: అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో దాదాపు 50వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఆర్‌5 జోన్‌

ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆర్‌5 జోన్‌లో ఇళ్ల స్థలాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Jagan Success In R5 zone: అమరావతి ఆర్‌5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రాంతంలో 47వేల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. దాదాపు 25లే ఔట్లలో 50వేల మంది పేదలకు సెంటు భూముల్ని మంజూరు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై అమరావతిలో రాజధానేతరులకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సమ్మతించింది. అమరావతిలో చేపట్టే 47 వేల ఇళ్లకు ఢిల్లీలో జరిగిన సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో అనుమతులు మంజూరు చేశారు. మొదటి విడత అనుమతుల్లో భాగంగా వీటిని మంజూరు చేశారు.

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆంక్షల మధ్యే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది.

కోర్టు వివాదాలు త్వరలోనే క్లియర్ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. దీంతో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి అవాస్ యోజన పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యాన్ని కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇళ్ళ నిర్మాణానికి ఆమోదముద్ర వేేసింది. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కోరిన నెలలోనే అనుమతులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ అమరావతిలో రాజధానేతరులైన 50,793 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో 47 వేల మందికి కేంద్రం తాజాగా ఇళ్లు మంజూరు చేయగా.. మిగతా ఇళ్ల నిర్మాణానికి తదుపరి సమావేశంలో అనుమతులిస్తామని కేంద్రం పేర్కొంది. 47 వేల మందికి పట్టణ పరిధిని ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం ఇళ్లు మంజూరు చేసింది.

ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తాయి. కేంద్రమిచ్చే రూ.1.50 లక్షలను ప్రాతిపదికగా తీసుకున్నా 47 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.705 కోట్లు అందనుంది.

అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని జులై 8న ప్రారంభించనున్నట్లు ఇళ్ల స్థలాల పంపిణీ సమయంలో జగన్‌ ప్రకటించారు. ఇక్కడ చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో మెజారిటీ వాటిని ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు షియర్‌వాల్‌ సాంకేతికతను వినియోగించనున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే నలుగురు కాంట్రాక్టర్లను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఎలక్షన్ కోడ్‌ వచ్చే లోపు వాటిలో గృహప్రవేశాలు చేయించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 148 ప్రాజెక్టుల నుంచి 46,928 మంది పేదలకు కేటాయించిన ఇళ్లను సాంకేతిక కారణాలు, అనర్హులను గుర్తించి వాటిని రద్దు చేసి, వాటి స్థానంలో అమరావతి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

WhatsApp channel