Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ, ప్రైవేటీకరణ ఆగినట్లేనా?
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే ప్రైవేటీకరణ ఆగినట్లేనని భావిస్తున్నారు.
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడం...ముఖ్యంగా టీడీపీ ఎన్డీఏలో కీలకంగా మారడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపాలని కేంద్రాన్ని కోరాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తు్న్నారు. ప్రైవేటీకరణపై ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతున్న సమయంలో...కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్యాకేజీపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక భాగం. స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అయితే తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ సెంటిమెంట్ గా మారింది. అందుకే రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందిస్తుంటాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పడానికి ఇదొక కారణం. ఏపీ పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నాయి. అవకాశం కుదిరినప్పుడల్లా దిల్లీ పర్యటనల్లో ఏపీ నేతలు ప్రైవేటీకరణ అంశాన్ని చర్చిస్తున్నారు. 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. అప్పులు, ముడి ఇనుము లభ్యత, కార్యకలాపాల నిర్వహణ, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల కారణంగా స్టీల్ ప్లాంట్ నష్టాల పాలైంది. ఈ సంస్థను ఆదుకునేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని స్టీల్ సెక్రెటరీ సందీప్ పౌండ్రిక్ ఇటీవల ఓ ప్రకటన చేశారు.
మూడు నెలలుగా జీతాల్లేవ్!
సీఎం చంద్రబాబు ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెచ్చారు. స్టీల్ ప్రైవేటీకరణ, ఆర్థిక ప్యాకేజీపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలు గట్టెక్కినట్లే. గత నాలుగు నెలలుగా తమకు జీతాలు లేవని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల సంఘం సీఎస్ విజయానంద్‌ను కలిశారు. వితంతువులకు పెన్షన్లు కూడా అందడం లేదని, స్టీల్ ప్లాంట్ సమస్యల గురించి, ప్రభుత్వ తక్షణ సాయం గురించి సీఎస్‌కు వినతి పత్రం అందించారు. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణాలకు, పేదల ఇళ్లకు విశాఖ ఉక్కును వినియోగించేలా చూడాలని ఉద్యోగులు సీఎస్ ను కోరారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు రూ.500 కోట్లు చొప్పున నాలుగు నెలలు అడ్వాన్సుగా ఇచ్చేట్లు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ఇటీవల తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఇటీవల దిల్లీ పర్యటనలో పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించారని సమాచారం.
ప్రైవేటీకరణ ఆగినట్లేనా?
తాజాగా స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందన్న వార్తలతో...ప్రైవేటీకరణపై పూర్తి స్థాయిలో వెనుకడుగు వేసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టీల్ ఉత్పత్తిని పెంచి సెయిల్ లో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటీకరణ ఆగితే...రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం కానుంది.
సంబంధిత కథనం