AP Debts : ఏపీ అప్పులు @ రూ. 4.42 లక్షల కోట్లు ! అప్పు రత్న అవార్డు ఇవ్వాలన్న పవన్.. !-central government clarifies on ap debts pawan kalyan slams cm jagan on increasing debts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Central Government Clarifies On Ap Debts Pawan Kalyan Slams Cm Jagan On Increasing Debts

AP Debts : ఏపీ అప్పులు @ రూ. 4.42 లక్షల కోట్లు ! అప్పు రత్న అవార్డు ఇవ్వాలన్న పవన్.. !

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 03:30 PM IST

AP Debts : ఆంధ్రప్రదేశ్ అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గడచిన 9 నెలల్లో ఏపీ సర్కార్ రూ. 55 వేల కోట్ల అప్పులు చేసిందన్న వార్తలపై స్పందించిన పవన్ కళ్యాణ్... భారతరత్న మాదిరిగా అప్పు రత్న అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

ఏపీ అప్పులు - పవన్ సెటైర్లు
ఏపీ అప్పులు - పవన్ సెటైర్లు

Andhra Pradesh Debts : ఆంధ్రప్రదేశ్ అప్పులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ మేరకు ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థికశాఖ మరోసారి బయటపెట్టింది. ఏపీ అప్పులపై రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి... 2019 నుంచి 2023 వరకు పెరిగిన అప్పుల వివరాలను వెల్లడించారు. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం... 2019లో రూ. 2,64, 451 కోట్లు ఉన్న ఏపీ అప్పులు... 2020 కి రూ. 3,07, 671 కోట్లకు పెరిగాయి. 2021లో రూ. 3,53,021 కోట్లకు చేరాయి. 2022 నాటికి రూ. 3,93,718 కోట్లకు ఎగసిన ఆంధ్రప్రదేశ్ అప్పులు.... 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 4,42,442 కోట్లకు చేరాయి. ఈ లెక్కన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా సుమారు రూ. 45 వేల కోట్ల అప్పులు చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక.. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో... గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా రూ.55,555 కోట్లకు చేరుకుంది. బడ్జెట్ లో పేర్కొన్న రుణాలు.. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ద్వారా వివిధ మార్గాల్లో ఏపీ సర్కార్ దొరికిన చోటల్లా అప్పులు చేస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అప్పులు మొత్తం.. ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు... ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా స్పందించారు. అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎంకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ... సీఎం జగన్ పై సెటైర్ వేశారు.

"అప్పులతో ఆంధ్రా పేరును ఇలాగే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరిచిపోవద్దు. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా అప్పురత్న అవార్డు ఇవ్వాలి" అని ఎద్దేవా చేస్తూ ట్విట్టర్ లో కార్టూన్ షేర్ చేశారు. దీనికి అప్పురత్న ఏపీ సీఎం హాష్ ట్యాగ్ జోడించారు. ఏపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న ఆయన.. కొద్దికాలంగా సెటైరికల్ కార్టూన్ లను షేర్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో అవి తెగ వైరల్ అవుతున్నాయి.

IPL_Entry_Point