Vizianagaram MLC Election 2024 : విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రద్దు - కారణాలివే
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉపఎన్నికపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు… నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న ఇందుకూరి రఘురాజునే ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇందుకూరి రఘురాజునే ఎమ్మెల్సీగా ఉండనున్నారు. శాసనమండలి మండలి చైర్మన్ నిర్ణయంతో ఇందుకూరి రఘురాజుపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఛైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ… రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుపై ఇటీవలే విచారణ జరిపిన ఏపీ హైకోర్టు… శాసన మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని స్పష్టం చేసింది.అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేసింది. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు… ఈసీఐ కూడా తాజాగా నిర్ణయం తీసుకుంది. రద్దు నిర్ణయంతో నవంబర్ 28వ తేదీన జరగాల్సిన ఉపఎన్నిక రద్దైంది.
ఈ ఉప ఎన్నిక కోసం నవంబర్ 4 నుంచి నామినేషన్లను స్వీకరించారు. ఈ గడువు నవంబర్ 11తో పూర్తి అయింది. ఈ నెల 12న నామినేషన్ల పరిశీలించారు. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ఉంది. నవంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగాల్సి ఉండేది. డిసెంబర్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. నామినేషన్ల ప్రక్రియ కీలక దశకు చేరిన నేపథ్యంలో… ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఈసీ కూడా నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఉప ఎన్నికతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నోటిఫికేషన్ రద్దు కావటంతో… ఎలక్షన్ కోడ్ కూడా రద్దు కానుంది.
వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీతో టచ్ లోకి వెళ్లారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును వైసీపీ బహిష్కరించింది. అనంతరం శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. మండలి ఛైర్మన్...ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీంతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. జూన్ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఛైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేసిన రఘురాజు…హైకోర్టులో ఊరట లభించటంతో ఈసీ కూడా తాజాగా నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ రద్దు కావటంతో రఘురాజే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండనున్నారు.