AP Formation Vs Kannada Rajyotsava: కర్ణాటకలో వేడుకలు, ఏపీలో నిర్లిప్తత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ వేడుకలకు దూరం
AP Formation Vs Kannada Rajyotsava: దేశంలో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా ఎలాంటి వేడుకలు జరగడం లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవం ఘనంగా జరుగుతున్నా ఏపీలో రాష్ట్రావతరణ దినోత్సవంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
AP Formation Vs Kannada Rajyotsava: రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడా ఆనవాళ్లే లేవు. పోరాటాలు, త్యాగాలతో, సుదీర్ఘ రాజకీయ ఉద్యమాలతో దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఏపీలో ఆ సంబరాల జాడే లేదు. పొరుగున ఉన్న కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవ కోలాహలంగా జరుగుతోంది.
పదేళ్ల క్రితం ఏపీ పునర్విభజన తర్వాత నెలకొన్న సందిగ్ధత నేటికి కొనసాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది.
అప్పట్లో విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం, హేతుబద్దత లేని వైనాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునవనిర్మాణ దీక్షలు నిర్వహించేవారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆ దీక్షతో ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చేవారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రావతరణ విషయంలో మళ్లీ చర్చ తలెత్తింది. అంతకు ముందు ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అవతరణ నిర్వహించక పోవడంతో వైసీపీ ప్రభుత్వం నవంబర్1న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత నవంబర్ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా గుర్తించింది. గతంలో ప్రధాని మోదీ సైతం రాష్ట్రావతరణ వేడుక శుభాకాంక్షలు తెలిపేవారు.
ఇంకా తేదీలపై గందరగోళమే..
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహణపై సందిగ్ధతకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కర్నూలు రాజధానిగా మూడేళ్ల పాటు ఆంధ్రరాష్ట్రం మనుగడలో ఉంది. 1953 అక్టోబర్1న ఆంధ్రరాష్ట్రం 11జిల్లాలతో ఏర్పాటైంది. ఆ తర్వాత మూడేళ్లకు తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిపి 1956లో మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. 2014 జూన్ 2 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది.
1953 అక్టోబర్ 1, 1956 నవంబర్ 1, 2014 జూన్ 2 వంటి తేదీతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం ఉండటంతో ఈ తేదీల విషయంలో సందిగ్ధత ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న భావోద్వేగాల నేపథ్యంలో రాష్ట్రావతరణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఐదేళ్ల పాటు జూన్2వ తేదీన నవనిర్మాణ దీక్షను మాత్రమే నిర్వహించే వారు.
ఏపీలో ఇలా కర్ణాటకలో అలా…
మరోవైపు ఏపీకి పొరుగున ఉన్న కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవం పేరుతో రాష్ట్రావతరణ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్య్రానందరం మైసూర్ రాజ్యం, హైదరాబాద్ సంస్థానం, బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ, కొడగు వంటి సుమారు ఇరవై పరిపాలనా విభాగాలుగా కన్నడ మాట్లాడే భూభాగాలు ఉండేవి.
మైసూరు రాజ్యం మాత్రమే కన్నడను అధికార భాషగా చేసింది. ప్రస్తుతం ఉన్న కర్ణాటకలో మూడింట రెండొంతుల భాగం విదేశీయుల పాలనలో ఉంది. కన్నడిగులు మెజారిటీగా ఉన్నప్పటికీ, పరిపాలనా హక్కు ఇతరుల చేతుల్లో ఉంది. హుబ్లీ కర్ణాటకను బొంబాయి ప్రెసిడెన్సీ పాలించింది. దీంతో వారు మరాఠీలో వ్యాపారం చేయాల్సి వచ్చింది. ఉర్దూను హైదరాబాద్, కర్ణాటకలోని నిజాంలు విధించారు. కోస్తా కర్ణాటక ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ పాలించింది.
అణిచివేతలతో ఉద్యమం..
కర్ణాటకను అనేక విభాగాలుగా పరిపాలించిన క్రమంలో భాషా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన కోపం కర్ణాటక ఏకీకరణ ఉద్యమంగా మారింది. 1890లో కర్ణాటక విద్యావర్ధక సంఘాన్ని స్థాపించారు. కన్నడ భాష పునరుద్ధరణ కోసం ఆర్.దేశ్ పాండే ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం కింద అనేక మంది నాయకులు ఇతరుల ఆధిపత్యంపై నిరసన తెలపడం ప్రారంభించారు. 1915లో కన్నడ సాహిత్య పరిషత్, మరుసటి సంవత్సరం శివమొగ్గలో కర్ణాటక సంఘం, 1955లో కాసర్ గోడ్ లో కర్ణాటక సమితి ఏర్పడ్డాయి.
కన్నడిగుల హక్కుల కోసం 1856 లోనే నిరసనలు ప్రారంభమయ్యాయి.ఆలూరు వెంకటరావు ప్రవేశం తరువాత ఇది తీవ్రమైంది.1903 లో విద్యావర్ధక సంఘం సమావేశంలో ఆలూరు కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నింటినీ మైసూర్ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
అక్కడి నుంచి ఆలూరు వెంకటరావు కర్ణాటక ఏకీకరణ పోరాటానికి నాయకత్వం వహించారు. బెంగాల్ విభజన ఆయనకు స్ఫూర్తినిచ్చింది.1907, 1908లలో ధార్వాడలో అఖిల కర్ణాటక రచయితల సదస్సును నిర్వహించారు.1915లో బెంగళూరులో కన్నడ సాహిత్య పరిషత్ ను స్థాపించారు.సాహిత్య పరిషత్ కు మైసూరు రాజు శ్రీ నల్వాడి కృష్ణరాజ వడయార్ నేతృత్వం వహించారు.
1912లో ఆలూరు వెంకటరావు కర్ణాటక గాట వైభవ అనే పుస్తకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో విజయనగర చరిత్ర నుండి మరాఠీల పాలన, నిజాంలు, బ్రిటిష్ పాలన వరకు ఉన్న సమాచారం ఉంది.ఈ రచన కన్నడిగులకు కొత్త ప్రేరణను ఇచ్చింది. ఏకీకరణ పోరాటం మరో స్థాయికి తెరతీసింది.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్…
అప్పుడే భారతదేశంలో స్వాతంత్య్రోద్యమ వేడి మొదలై, అదే సమయంలో ప్రత్యేక కర్ణాటక కోసం పోరాటాలు తీవ్రమయ్యాయి. గుడ్లెప్ప హల్లికేరి, సిద్ధప్ప కంబలి, ఆర్.హెచ్.దేశ్పాండే, రంగారావు దివాకర్, శ్రీనివాసరావు కౌజలగి,, శ్రీనివాసరావు మంగళ్వాడే, కెంగల్ హనుమంతయ్య, గొరూర్ రామస్వామి అయ్యంగార్, ఎస్.నిజలింగప్ప, టి.మరియప్ప, సుబ్రమణ్యం, సాహుకర్ చెన్నయ్య, బి.వి.కక్కిలయ్య, ఎ.ఎన్.కె. వి.పి.మాధవరావు అధ్యక్షతన ధార్వాడ్ లో జరిగిన కర్ణాటక రాష్ట్ర రాజకీయ మహాసభలో కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఏకం చేయాలని 1920లో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
1920లో 800 మంది కన్నడిగులతో కూడిన ప్రతినిధి బృందం నాగ్ పూర్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఎస్.నిజలింగప్ప, కెంగల్ హనుమంతయ్య మొదలైన నాయకులు కన్నడ ఉద్యమానికి నాయకత్వం వహించి తరువాత ముఖ్యమంత్రి అయ్యారు.
1924 లో, గాంధీజీ అధ్యక్షతన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ బెళగావి సమావేశం నిర్వహించబడింది, ఇక్కడ కర్ణాటక ఏకీకరణ్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది.
1946 జనవరి 10న బొంబాయిలో ఏకీకరణోద్యమ సదస్సు జరిగింది, దీనిని సర్దార్ పటేల్ ప్రారంభించారు.
హైదరాబాద్ విలీనంతో…
హైదరాబాద్ నిజాంలు సంస్థానాన్ని భారత యూనియన్ లో చేరడానికి నిరాకరించడంతో హైదరాబాద్ ను బలవంతంగా ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ప్రతిస్పందనగా కన్నడ ఉద్యమకారులు కర్ణాటక ఏకీకరణ్ పార్టీని స్థాపించి 1951 ఎన్నికలలో పోటీ చేశారు.1953లో జరిగిన కాంగ్రెస్ హైదరాబాద్ మహాసభలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు తీర్మానం చేసి కర్ణాటక పేరును తొలగించారు.దీంతో హుబ్బళ్ళిలో ప్రజలు తిరుగుబాటు చేశారు.
ఎంతో ఒత్తిడి తర్వాత ఈ కమిటీ భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు సిఫారసు చేసింది. దీనిని పార్లమెంటు కూడా ఆమోదించింది. అన్నింటికీ మించి కర్ణాటక ఏకతాటిపైకి వచ్చింది. కేరళకు కిరీటమైన కాసర్గోడ్ ను కర్ణాటకలో కలపాలని పోరాటం ఇంకా కొనసాగుతోంది. 1973 నవంబర్ 1న ముఖ్యమంత్రి దేవరాజ్ అరస్ మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా పేరు మార్చారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత ఏర్పాటైన కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పటికీ అక్కడ ఘనంగా జరుపుకుంటారు.