CBI on Viveka Case : హైదరాబాద్ కు వివేకా హత్య కేసు ఫైళ్లు.. మున్ముందు అనూహ్య పరిణామాలు.. ? -cbi officials move viveka murder case files from kadapa court to hyderabad cbi court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Officials Move Viveka Murder Case Files From Kadapa Court To Hyderabad Cbi Court

CBI on Viveka Case : హైదరాబాద్ కు వివేకా హత్య కేసు ఫైళ్లు.. మున్ముందు అనూహ్య పరిణామాలు.. ?

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 09:34 PM IST

CBI on Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ అధికారులు.. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి కేసు ఫైళ్లను హైదరాబాద్ సీబీఐ కోర్టుకి తరలించారు. హైదరాబాద్ నుంచి విచారణ మొదలైన తర్వాత.. ఈ కేసులో మరిన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

హైదరాబాద్ కు వివేకా హత్య కేసు ఫైళ్లు
హైదరాబాద్ కు వివేకా హత్య కేసు ఫైళ్లు (facebook)

CBI on Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో... హైదరాబాద్ సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం కడప జిల్లా సెషన్స్ కోర్టుకి చేరుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఆఫీసర్లు... హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లను సేకరించారు. ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను.. 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి తరలించారు. కడప కోర్టులో ఐదుగురు నిందితులపై సీబీఐ 2 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫైళ్లను పూర్తిగా పరిశీలించిన వెంటనే.. సీబీఐ విచారణను ప్రారంభించనుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారితో సహా అనుమానితులను విచారించనుంది. ఈ మేరకు పూర్తి లిస్ట్ తయారు చేసే పనిలో సీబీఐ నిమగ్నమైంది. ఇప్పటికే.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

సీబీఐ నోటీసుల ప్రకారం.. వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో.. తనకు 4, 5 రోజుల గడువు కావాలని ఆయన కోరారు. ఈ మేరకు సీబీఐకి సమాచారం పంపించారు. మళ్లీ వారు పేర్కొనే తేదీన వెళతానని... విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని అవినాష్ తెలిపారు. నిజం తేలాలన్నదే తన కోరిక అని చెప్పారు.

"రెండున్నరేళ్లుగా నాపై, నా కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కొంత మంది కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఇవన్నీ భరించాను. ఏ రోజు ఎవరినీ ఒక్క మాటా అనలేదు. ఆ అభియోగాలు జీర్ణించుకోవాలంటేనే నా మనస్సు ఒప్పుకోవడం లేదు. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో.. నా వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలకు తెలుసు. నేను ఒకే ఒక్కటి మనవి చేస్తున్నా. న్యాయం గెలివాలి. నిజం గెలవాలి. ఇష్టం వచ్చినట్లు నిర్ణయానికి రావద్దు. వ్యక్తిగత ఆరోపణలతో ఎంత మంది మనసులు బాధపడతాయో ఆలోచించాలి. కాబట్టి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించండి" అని అవినాష్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ సీబీఐ కేసు విచారణలో దూకుడు పెంచిన తర్వాత మరిన్ని సంచలనాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నోటీసుల జారీ ఒక్క అవినాష్ రెడ్డితో ఆగేది కాదని... మున్ముందు చాలా మంది ఇలాంటి నోటీసులు అందుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసుకి సంబంధించి తమకు తెలిసిన విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ.. కొందరు కీలక వ్యక్తులను సీబీఐ విచారణకు పిలిచే అవకాశం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మున్ముందు మరిన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

IPL_Entry_Point