YS Viveka Case: వివేకా కేసులో మరో ట్విస్ట్... 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డిని చేర్చిన CBI
YS Viveka Case Latest Updates: వివేకా హత్య కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది సీబీఐ.
YS Viveka Case News: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు కాగా... మరోవైపు సీబీఐ దూకుడు పెంచింది. ఈ హత్యకేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని జూన్ 5వ తేదీన సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో కీలక విషయాలను ప్రస్తావించింది.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి సహ నిందితుడిగా చెబుతూ వచ్చిన సీబీఐ.... ఈ కౌంటర్ పిటిషన్ లో మాత్రం 8 నిందితుడిగా పేర్కొంది కేంద్ర దర్యాప్తు సంస్థ. గతంలో అవినాష్ రెడ్డిని ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పని సీబీఐ.... కానీ 5వ తారీఖున దాఖలు చేసిన కౌంటర్‌లో మాత్రం A8గా పేర్కొనటం కీలక పరిణామంగా మారింది. హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని ప్రస్తావించింది. వీరిద్దరికి ఈ కేసుతో ప్రమేయం ఉందని తెలిపింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని వివరించింది.
ఎన్.శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోనే అవినాశ్ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని సీబీఐ తెలిపింది. ఉదయం 5.20కు ముందే అవినాశ్ రెడ్డి శివశంకర్ రెడ్డితో మాట్లాడారని... ఇదే విషయంపై దస్తగిరి వాంగ్ముల ఇచ్చారని గుర్తు చేసింది. కేసు పెట్టొద్దని,పోస్టు మార్టం నిర్వహించొద్దని సీఐ శంకరయ్యకు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి చెప్పారని... సీబీఐకి,కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని శంకరయ్యతో పాటు అవినాష్ రెడ్డి కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ప్రస్తావించి సీబీఐ. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే అని సీబీఐ పేర్కొంది. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం జరుగుతుందని రాసుకొచ్చింది.
దూకుడు పెంచిన సీబీఐ…
మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. వివేకా రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి పొందింది. వివేకా రాసిన లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించే పనిలో పడింది సీబీఐ. నిన్‌హైడ్రిన్ పరీక్ష కోసం ఈ లేఖను దిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్ కు పంపించేందుకు కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. ఒరిజినల్ లేఖను కోర్టుకు సమర్పించి, సర్టిఫైడ్ కాపీలను తీసి పెట్టుకోవాలని కోర్టు సీబీఐకి సూచించింది. నిన్ హైడ్రిన్ పరీక్షలో ఒక వేళ ఒరిజినల్ లేఖ దెబ్బతిన్నట్టయితే సర్టిఫైడ్ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సీబీఐని తెలిపింది. డ్రైవర్ ప్రసాద్ తనను హత్య చేసినట్టు వివేకా హత్యా జరిగిన స్థలంలో ఈ లేఖ లభించింది. లేఖను 2021లో సీబీఐ కడప కోర్టు ద్వారా తీసుకుంది. వివేకా లేఖను 2021 ఫిబ్రవరి 11న దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపించి, లేఖ వివేకా రాసిందేనా? ఒత్తిడిలో రాశారా? అని విశ్లేషించాలని నివేదిక ఇవ్వాలని కోరింది. వివేకా రాసిన ఇతర పత్రాలతో పోల్చిన సీఎఫ్ఎస్‌ఎల్ .. అది వివేకా రాసిందేనని, అయితే తీవ్ర ఒత్తిడిలో రాసినట్లు తేల్చి సీబీఐకి నివేదిక ఇచ్చింది. అయితే ఆ లేఖను బలవంతంగా రాయించినట్టు దస్తగిరి తెలపడంతో, లేఖపై వేలిముద్రలు గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ మరోసారి కోరింది.
వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తించాలంటే నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు సీబీఐ అధికారులకు తెలియజేశారు. అయితే నిన్ హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంక్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో లేఖ కీలక ఆధారంగా ఉండడంతో సీబీఐ కోర్టును ఆశ్రయించింది. నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతివ్వాలని కోర్టును కోరింది. అసలు లేఖ బదులుగా జిరాక్స్‌ను రికార్డుల్లో ఉంచాలని కోర్టును కోరింది. ఈ లేఖపై వేలిముద్రలను పోల్చిచూడాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలను నిందితుల తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. ఆ పిటిషన్ చట్టసమ్మతం కాదని వాదించారు. అయితే లేఖ నిన్ హైడ్రిన్ టెస్ట్ కు అనుమతిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
పేపర్ ఉపరితలాలపై వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రిన్ టెస్టును ఉపయోగిస్తారు. ఫోరెన్సిక్ పరీక్షలకు దొరకని ఆధారాలను గుర్తించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కొన్ని రసాయనాల ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తారు. అత్యంత నిపుణులు చేసే ఈ టెస్టు ద్వారా లేఖపై ఉన్న వేలి ముద్రలు, ఇతర గుర్తులన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఈ టెస్టు కీలకంగా మారుతుందని సీబీఐ భావిస్తోంది.
సంబంధిత కథనం