CBI Case On KLEF University : NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్
CBI Case On KLEF University : గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. NAAC అక్రెడిటేషన్ కోసం లంచాలు ఇచ్చారని యూనివర్సిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ యూనివర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్ సహా 10 మందిని సీబీఐ అరెస్టు చేసింది.
CBI Case On KLEF University : NAAC A++ రేటింగ్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలపై గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసింది.

అనుకూల రేటింగ్ కోసం లంచాలు
తమ విద్యాసంస్థకు అనుకూలమైన రేటింగ్ ఇచ్చేందుకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ నిర్వాహకులు NAAC టీమ్ సభ్యులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ...కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీలో సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసింది. ఈ విద్యాసంస్థ నిర్వాహకులు... NAAC టీమ్ సభ్యులకు నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో సీబీఐ చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. సుమారు రూ. 37 లక్షల నగదు, 6 లెనోవా ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ 16 ప్రో మొబైల్ ఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు.
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు
1. కోనేరు సత్యనారాయణ,ప్రెసిడెంట్, కేఎల్ఈఎఫ్
2. జీపీ సారథి వర్మ, వైస్ ఛాన్సలర్, కేఎల్ఈఎఫ్
3. కోనేరు రాజా హరీన్, వైస్ ప్రెసిడెంట్, కేఎల్ఈఎఫ్
4. ఎ. రామకృష్ణ, డైరెక్టర్, కేఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్ క్యాంపస్
5. డాక్టర్ ఎల్. మంజునాథ రావు, మాజీ డిప్యూటీ అడ్వైజర్, NAAC
6. ఎమ్. హనుమంతప్ప, ప్రొఫెసర్ & డైరెక్టర్ (IQAC- NAAC), బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు,
7. ఎమ్.ఎస్ శ్యాంసుందర్, సలహాదారు, NAAC, బెంగళూరు,
8. సమరేంద్ర నాథ్ సాహా, రామచంద్ర చంద్రవంశీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, న్యాక్ ఇన్‌స్పెక్షన్ కమిటీ ఛైర్మన్
9. రాజీవ్ సిజారియా, ప్రొఫెసర్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), ఢిల్లీ, NAAC కమిటీ కోఆర్డినేటర్
10. డా. డి. గోపాల్, డీన్, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, NAAC కమిటీ సభ్యుడు
11. రాజేష్ సింగ్ పవార్, డీన్, జాగ్రన్ లేక్సిటీ యూనివర్సిటీ, భోపాల్, NAAC కమిటీ సభ్యుడు
12. మానస్ కుమార్ మిశ్రా, డైరెక్టర్, GL బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, NAAC కమిటీ సభ్యుడు
13. గాయత్రి దేవరాజా, ప్రొఫెసర్, దావణగెరె విశ్వవిద్యాలయం, NAAC తనిఖీ కమిటీ సభ్యులు
14. డాక్టర్ బులు మహారాణా, ప్రొఫెసర్, సంబల్పూర్ విశ్వవిద్యాలయం, NAAC కమిటీ సభ్యులు