CBI Court: సిఎం జగన్, సాయిరెడ్డిల విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి
CBI Court: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు పలు ఫోన్లకు అందుబాటులో ఉండాలని సూచించింది.
CBI Court: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి లు విడివిడిగా విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. కుమార్తెలను చూసేందుకు యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు యూకే పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. కుమార్తెలను కలిసేందుకు భార్య భారతితో కలిసి యూకే వెళ్లనున్నట్టు సీబీఐ కోర్టుకు జగన్ అభ్యర్ధించారు.
విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ పొలిటికల్ క్లియరెన్స్ కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా కోరినట్టు పేర్కొన్నారు. ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని సీబీఐ కోర్టును జగన్ అభ్యర్థించారు. మరోవైపు సీఎం జగన్ యూకే పర్యటనకు అనుమతిఇవ్వొద్దని సీబీఐ వాదించింది.
తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్.. హక్కుగా కోర్టును అనుమతి అడగరాదని సీబీఐ పేర్కొంది. ఎనిమిదేళ్లలో పలు కారణాలతో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు జగన్ అనుమతులు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. జగన్‌పై ఉ్న ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలో ప్రస్తావించిందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది.
జగన్‌పై ఉన్న కేసులు సున్నితమైనవని, హై ప్రొఫైల్ కేసులుగా సీబీఐ పేర్కొంది. ఇరు వైపులా వాదనల అనంతరం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఫోన్ నంబర్, ఈ-మెయిల్, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
విజయసాయిరెడ్డికీ అనుమతి..
విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకేతో పాటు, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ముగించిన కోర్టు.. ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది.
సెప్టెంబరు 1 నుంచి జనవరి 31 మధ్య కాలంలో 30 రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ సమయంలో రూ.2లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఫోన్ నంబరు,ఈమెయిల్, విదేశీ పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
సాయిరెడ్డి పర్యటన వివరాలు సమర్పించి పాస్ పోర్టు తీసుకొని.. పర్యటనలు ముగించుకుని స్వదేశానికి తిరిగి రాగానే మళ్లీ కోర్టులో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, జనవరి 31 లోగా అభియోగాలు నమోదు చేస్తే తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని విజయసాయికి సిబిఐ కోర్టు స్పష్టం చేసింది.