NAAC Bribes Case: నాక్ గ్రేడింగ్ కోసం లంచాలు, నాక్‌ ఛైర్మన్‌ సహా పదిమందిని అరెస్ట్ చేసిన సీబీఐ-cbi arrests 10 people including naac chairman for accepting bribes for naac grading ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Naac Bribes Case: నాక్ గ్రేడింగ్ కోసం లంచాలు, నాక్‌ ఛైర్మన్‌ సహా పదిమందిని అరెస్ట్ చేసిన సీబీఐ

NAAC Bribes Case: నాక్ గ్రేడింగ్ కోసం లంచాలు, నాక్‌ ఛైర్మన్‌ సహా పదిమందిని అరెస్ట్ చేసిన సీబీఐ

HT Telugu Desk HT Telugu
Published Feb 10, 2025 09:30 AM IST

NAAC Bribes Case: ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌కు ఇచ్చే గుర్తింపు కోసం నాక్‌ బృందానికి ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో పదిమందిని సీబీఐ అరెస్ట్ చేసింది. నాక్ చైర్మ‌న్‌, కేఎల్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌తో ప‌దిమందిని సీబీఐ అరెస్టు చేసింది. వర్శిటీ నాక్‌ గుర్తింపును ఐదేళ్లు సస్పెండ్ చేశారు.

NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్
NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్

NAAC Bribes Case: నాక్‌ గ్రేడింగ్‌ వ్యవహారంలో సీబీఐ కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌కు ఇచ్చే నేష‌న‌ల్‌ అసెస్‌మెంట్ అండ్‌ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఎఎసి) గ్రేడ్‌లు ఇచ్చేందుకు ముడుపులు తీసుకోవ‌డం వెలుగులోకి వ‌చ్చింది. జేఎన్‌యూ ప్రొఫెస‌ర్, నాక్ క‌మిటీ స‌భ్యుడు రాజీవ్ సిజారియా కేఎల్ యూనివ‌ర్శిటీకు నాక్ త‌నిఖీ నివేదిక‌ను తారుమారు చేయ‌డానికి త‌న నివాసంలో లంచం కోసం చ‌ర్చ‌లు జ‌రిపారు.

మెరుగైన ర్యాంకింగ్‌ ఇవ్వ‌డానికి నాక్ బృందం సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఎల్ఈఎఫ్‌) నుండి రూ.1.8 కోట్లు డిమాండ్ చేశారు. చర్చల తరువాత‌, రూ.28 లక్షలకు ఒప్పందం ముగిసింది. ఇందులో ప్రొఫెస‌ర్ రాజీవ్ సిజారియా ప్రధాన వాటాను సొంతం చేసుకున్నాడు.

2018లో కేఎల్ యూనివర్శిటీ నాక్ ఏ++ గ్రేడ్‌లో అత్యధిక స్కోరును సాధించింది. 2013లో లభించిన ఏ గ్రేడ్ కంటే అప్పుడు రెండు గ్రేడ్‌లు ఎక్కువగా ఉంది. ర్యాంకింగ్స్‌ గడువు ముగియడంతో నాక్ మరోసారి తనిఖీలు జరపాల్సి ఉంది. 2024-29 కాలానికి నాక్ గుర్తింపు కోసం జనవరి 29 నుండి 31 వరకు నాక్‌ ఇన్‌స్టిట్యూట్ తనిఖీకి షెడ్యూల్ చేశారు. అంత‌కు ముందే జ‌న‌వ‌రి 26న లంచం చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ వ్యవహారంపై సీబీఐ సోదాలు నిర్వ‌హించి కేసు న‌మోదు చేసింది. దీంతో ప్రొఫెసర్‌ సిజారియాను జేఎన్‌యూ సస్పెండ్ చేసింది.

సీబీఐ అరెస్టు చేసింది వీరినే

ప్రొఫెస‌ర్ సిజారియాతో సహా మొత్తం ప‌ది మందిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ నెల ప్రారంభంలో నాక్‌ కమిటీ చైర్మన్, రామచంద్ర చంద్రవంశీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సమేంద్ర నాథ్ సాహా, నాక్ స‌భ్యులు, జెఎన్‌యు ప్రొఫెస‌ర్ రాజీవ్ సిజారియా, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా డీన్ డి. గోపాల్, జాగ్రన్ లేక్‌సిటీ విశ్వవిద్యాలయం డీన్ రాజేష్ సింగ్ పవార్, జీఎల్‌ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మానస్ కుమార్ మిశ్రా, దావణగెరె విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గాయత్రి దేవరాజా, సంబల్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బులు మహారాణా, కెఎల్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్సలర్ జీపీ సారధి వర్మ, మరో ఇద్దరు ఆఫీస్ బేరర్లతో సహా మొత్తం ప‌ది మందిని సీబీఐ అరెస్టు చేసింది.

నాక్ అక్రిడిటేష‌న్‌ ఐదేళ్ల నిషేధం

కేఎల్ యూనివర్శిటీను ఐదేళ్ల పాటు అక్రిడిటేషన్ నుండి నిషేధించారు. అనిల్ సహస్రబుద్ధే నేతృత్వంలోని నాక్‌ కార్యనిర్వాహక కమిటీ రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే నాక్ క‌మిటీలోని ఏడుగురు స‌భ్యులపై కూడా జీవిత‌కాలం పాటు నాక్, ఇతర కార్యకలాపాలలో నిషేధం విధించారు.

లంచాల వ్య‌వ‌హారంపై సమగ్ర ద‌ర్యాప్తు చేయాలిః ఎస్ఎఫ్ఐ

నాక్ గ్రేడ్ కోసం లంచం కుంభకోణాన్ని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు ఎస్ఎఫ్ఐ అఖిత భార‌త అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వీపీ సాను, మ‌యూక్ బిశ్వాస్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ లంచాల వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేశారు.

నాక్‌, యూజీసీ అధిపతిగా ఉన్న మామిడాల జగదీష్ కుమార్ ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "సంస్థలు అనుకూలమైన అక్రిడిటేషన్ రేటింగ్‌లను కొనుగోలు చేయ‌డంతో విద్యార్థులు మోసపోతున్నారని, విద్యా ప్రమాణాలను తారుమారు చేస్తున్నారని, ప్ర‌జల నమ్మకాన్ని నాశనం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి" అని అన్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జార‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner