Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో అరెస్ట్
Ys Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి సాక్ష్యాధారాలను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Ys Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. కడప నుంచి హైదరాబాద్‌కు ఉదయ్ కుమార్ రెడ్డిని తరలిస్తున్నారు. కడపకు వచ్చిన సీబీఐ ప్రత్యేక సిట్ బృందం పులివెందులలోని ఇంటికెళ్లి ఉదయ్ ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల నుంచి కడప కారాగారంలోని అతిథిగృహానికి తీసుకెళ్లి విచారించారు.
ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్ రెడ్డి, న్యాయవాది సమక్షంలో ఉదయ్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టు మెమోను ఉదయ్ కుటుంబసబ్యులకు సీబీఐ అందచేసింది. ఉదయ్ కుమార్ రెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి అరెస్టు చేశారు. కడప నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఉదయ్ ను తరలిస్తున్నారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉదయ్ ను హాజరుపరిచే అవకాశం ఉంది.
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లైంది. అవినాష్‍రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న గజ్జల ఉదయ్‍కుమార్ రెడ్డి, కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్నారు.
ఉదయ్ కుమార్ రెడ్డి గతంలో సీబీఐ ఎస్పీ రామ్‍సింగ్‍పై కడప కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఉదయ్ ఫిర్యాదు మేరకు గతేడాది ఫిబ్రవరిలో రామ్‍సింగ్‍పై కేసు నమోదు చేశారు. ఉదయ్ ఫిర్యాదుతో రిమ్స్ పోలీసులు ఎస్పీ రామ్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ కోర్టులో సవాలు చేయడంతో కేసును కొట్టేశారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్‍తో పాటు ఘటనాస్థలికి ఉదయ్ వెళ్లినట్లు గుర్తించారు.
హత్య జరిగిన సమయంలో గూగుల్ టేక్‍అవుట్ ద్వారా ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. వివేకా మృతదేహానికి బ్యాండేజ్ వేసి కట్లు కట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలో పలుమార్లు ఉదయ్‍కుమార్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు, హత్యజరిగిన రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు.
మరోవైపు వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌లో సైతం ఉదయ్‌కుమార్ రెడ్డి గురించి సిబిఐ ప్రస్తావించింది. వివేకా హత్య జరిగిన తర్వాత మృతదేహానికి కట్లు కట్టి, సాక్ష్యాధారాలను మాయం చేయడంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఏమి జరుగనుందోననే ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ నెలాఖరులోగా సిబిఐ దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
సంబంధిత కథనం