AP Road Accident : పొగ మంచు ఎఫెక్ట్.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు
AP Road Accident : పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం పీలేరు సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే పొగముంచు కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

పొగ మంచు కారణంగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. పీలేరు సమీపంలో ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న వారు చెన్నై నుంచి రాయచోటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగ్గానే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రూయాకు తరలించారు.
40 వేల ప్రమాదాలు..
పొగమంచు కారణంగా ఏటా దేశంలో 40 వేల ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 600 మంది మృత్యువాత పడుతుండగా.. 16 వేల మంది గాయాల పాలవుతున్నారు. ఎక్కువగా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు కారణంగా.. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
జాగ్రత్తలు..
అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఉదయం 8 గంటల్లోపు దూర ప్రయాణాలు కొనసాగించొద్దని పోలీసులు సూచిస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని చెబుతున్నారు. వాహనం నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా లైట్లు ఆన్ చేసి ఉంచాలి. లోబీమ్ ఫాగ్ లైట్లు ఉండేలా చూసుకోవాలి. తక్కువ వేగంతో వెళ్లాలని.. వేగం పెరిగే కొద్దీ ఎక్కువ దూరం చూడలేరని స్పష్టం చేస్తున్నారు.
పోలీసుల సూచనలు..
హైవేలు, శివారు రహదారులపై వాహనాల మధ్య కచ్చితమైన దూరం పాటించాలని.. పోలీసులు సూచిస్తున్నారు. విండ్ స్కీన్ర్, సైడ్ అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షితమైన స్థలంలో వాహనాన్ని నిలపివేయాలని సూచిస్తున్నారు. అది కూడా ఇతర వాహనదారులకు కనిపించేలా ఉండాలని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి నీటి బిందువులుగా మారుతుంది. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ.. పొగమంచును ఏర్పరుస్తాయి. కాలుష్యం కూడా పొగమంచు ఏర్పడటానికి కారణం కావచ్చు. కాలుష్య కణాలు నీటి బిందువులకు కేంద్రంగా పనిచేసి.. వాటిని ఘనీభవించేలా చేస్తాయి.