బద్వేల్-నెల్లూరు కారిడార్ లోని కీలక అంశాలు
- ఈ కొత్త నాలుగు వరుసల కారిడార్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రస్తుత జాతీయ రహదారి ఎన్ హెచ్-67లోని గోపవరం గ్రామం నుండి ప్రారంభమై ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఎన్ హెచ్ -16 (చెన్నై-కోల్కతా) లోని కృష్ణపట్నం పోర్ట్ జంక్షన్ వద్ద ముగుస్తుంది.
- చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ) కింద ప్రాధాన్య నోడ్ గా గుర్తించిన కృష్ణపట్నం పోర్టుకు బద్వేల్-నెల్లూరు కారిడార్ వ్యూహాత్మక కనెక్టివిటీని అందిస్తుంది.
- ప్రస్తుతం ఉన్న బద్వేల్-నెల్లూరు రహదారితో పోలిస్తే ఈ ప్రతిపాదిత కారిడార్ దూరాన్ని 142 కిలోమీటర్ల నుంచి 108.13 కిలోమీటర్లకు, అంటే 33.9 కిలోమీటర్లు తగ్గించడంతో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ సమయం గంట తగ్గుతుందని భావిస్తున్నారు.
- విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్బీఐసీ)లోని ఓర్వకల్ నోడ్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ)లోని కృష్ణపట్నం నోడ్ వంటి మూడు పారిశ్రామిక కారిడార్లలోని ముఖ్యమైన నోడ్లకు ఈ కారిడార్ ద్వారా ప్రవేశం సులభతరం అవుతుంది.
- ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 20 లక్షల పనిదినాలు, పరోక్షంగా 23 లక్షల పనిదినాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది.
కొత్త రైల్వే ప్రాజెక్టులు
మరోవైపు, ప్రయాణీకులు, వస్తువుల రవాణాను సులభతరం, వేగవంతం చేసే రెండు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.3,399 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2029-30 నాటికి పూర్తవుతాయని అంచనా. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అని కేంద్రం తెలిపింది.