Visakha Actress Arrest: స్నేహితురాలి ఇంట్లో చోరీలతో జల్సాలు, విశాఖలో వర్ధమాన నటి అరెస్ట్, బంగారం స్వాధీనం
Visakha Actress Arrest: జల్సాలకు అలవాటు పడిన ఓ యువతి స్నేహితురాలి ఇంటికి కన్నం వేసింది. గుట్టు చప్పుడు కాకుండా భారీగా బంగారాన్ని కాజేసి జల్సాలు చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది.
Visakha Actress Arrest: విశాఖపట్నంలో కలకలం సృష్టించిన బంగారం చోరీ వ్యవహారంలో బాధితురాలి స్నేహితురాలే నిందితురాలిగా తేలింది. దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో జరిగిన దొంగతనం కేసులో ఓ యువ నటి సోము సౌమ్య శెట్టిని Somu Sowya setty 4 టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 57 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
పెందుర్తికి చెందిన సౌమ్యశెట్టి బాధితుడు జనపాల ప్రసాద్ కుమార్తె స్నేహితురాలు. ఇద్దరికి గతంలో పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో తిరిగి పరిచయం అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఆమె ఇంటికి వచ్చిన ఈ యువతి బీరువాలో ఉన్న బంగారాన్ని దొంగిలించింది. బాధితులు ఫిబ్రవరి 23న బీరువా తెరిచి చూడగా అందులో 74 తులాల బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని గుర్తించారు. సౌమ్యశెట్టి కొన్నేళ్లుగా చిన్నాచితక చిత్రాల్లో నటిస్తోంది. చోరీ తరువాత నగలతో గోవా Goa వెళ్లి జల్సాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఏమి జరిగిందంటే….
విశాఖపట్నంలోని దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్సీ లో ఉంటున్న జనపాల ప్రసాద్ కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ప్రసాద్ కుమార్తె మౌనిక 2016లో బీటెక్ చదువుతున్న సమయంలో యూట్యూబ్ వీడియోలు , షార్ట్‌ఫిల్స్మ్‌లో నటించే గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సౌమ్యతో పరిచయమైంది.
మౌనికకు కూడా నటనపై ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. ఆ తర్వాత మౌనిక పెళ్లి కావడంతో ఇద్దరు విడిపోయారు. సౌమ్యకు కూడా సుజాతానగర్‌లో ఉంటున్న ఒడిశాకు చెందిన బలరాం శెట్టితో వివాహం జరిగింది.
ఇటీవల మౌనికకు పాప పుట్టడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలని షేర్ చేసింది. ఈ ఏడాది జనవరిలో సౌమ్యశెట్టి ఆ పోస్ట్‌కు స్పందించడంతో ఇద్దరి మధ్య మళ్లీ మాటలు మొదలయ్యాయి.
డెలివరీ అయ్యాక పుట్టింట్లో ఉంటున్నానని సౌమ్యకు మౌనిక చెప్పింది. ఈ క్రమంలో సౌమ్య పలుమార్లు దొండపర్తిలోని మౌనిక పుట్టింటికి వచ్చింది. ఫిబ్రవరి 23న ఎలమంచిలిలోని బంధువుల ఇంటిలో శుభకార్యక్రమం ఉండడంతో మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులు బంగారు ఆభరణాల కోసం బెడ్‌రూమ్‌లోని లాకర్‌లో చూడ్డంతో అవి గల్లంతైనట్టు గుర్తించారు.
ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసి వివరాలు సేకరించారు. ఇటీవలి కాలంలో తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్లిన వారిలో నటి సౌమ్య కూడా ఉన్నట్టు చెప్పారు. పలుమార్లు వాష్‌రూమ్‌కి వెళతానంటూ మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకునేదని బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు ఆమె గురించి ఆరా తీశారు. ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి, లావాదేవీలను పరిశీలించారు. ఫిబ్రవరి 6వ తేదీన విశాఖలోని లలితా జ్యువెలరీలో రూ.పది లక్షల విలువైన పాతబంగారం విక్రయించి, కొత్త నగలు తీసుకున్నట్టు గుర్తించారు.
కురుపాం మార్కెట్‌లోని 2 బంగారం దుకాణాలలో పాత బంగారం విక్రయించి, వచ్చిన డబ్బుని ఏటీఎంలో ఖాతాలోకి డిపాజిట్ చేసుకున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత తనకేమి తెలీదని బుకాయించినా ఆర్ధిక లావాదేవీలను బయటపెట్టడంతో నిజం అంగీకరించింది.
స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన బంగారం అమ్మేసి వచ్చిన డబ్బులో రూ.4 లక్షలు ఖర్చుతో గోవాలో ఎంజాయ్ చేయడానికి, మరో రూ.2 లక్షలు క్రెడిట్‌కార్డు అప్పులు తీర్చడానికి, రూ. 1.5 లక్షలుతో కారు రిపేర్లు చేయించడానికి వినియోగించినట్టు గుర్తించారు. నిందితురాలి నుంచి 57తులా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.