Flood Compensation: స్వచ్ఛందంగా పరిహారాన్ని వదులుకున్న ప్రజలు, 3.71 లక్షల మందికి పరిహారం చెల్లింపులు-budameru flood compensation payments to 3 71 lakh people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Flood Compensation: స్వచ్ఛందంగా పరిహారాన్ని వదులుకున్న ప్రజలు, 3.71 లక్షల మందికి పరిహారం చెల్లింపులు

Flood Compensation: స్వచ్ఛందంగా పరిహారాన్ని వదులుకున్న ప్రజలు, 3.71 లక్షల మందికి పరిహారం చెల్లింపులు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 27, 2024 09:12 AM IST

Flood Compensation: బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపు కొనసాగుతోంది. బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వరద సాయాన్ని జమ చేస్తున్నారు. ఆధార్‌ ద్వారా గురువారం సాయంత్రానికి 3.71లక్షల చెల్లింపులు జరిగాయి. మరోవైపు దాదాపు 80వేల మంది స్వచ్ఛందంగా పరిహారాన్ని వదులుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

స్వచ్ఛంధంగా పరిహారం వదులుకున్న 80వేల మంది ప్రజలు
స్వచ్ఛంధంగా పరిహారం వదులుకున్న 80వేల మంది ప్రజలు (image source Twitter)

Flood Compensation: బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపు కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి దాదాపు 536.28కోట్ల రూపాయల పరిహారాన్ని ముంపు బాధితుల ఖాతాలకు ఆధార్‌ బేస్డ్‌ చెల్లింపుల ద్వారా నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో చేపట్టారు. గురువారం సాయంత్రానికి మొత్తం 3,71, 302మందికి పరిహారం చెల్లింపుకు ఏర్పాట్లు చేసినట్టు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా హిందుస్తాన్‌ టైమ్స్‌కు తెలిపారు.

మరో రూ.10.69కోట్ల రుపాయల చెల్లింపులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయన్నారు. 16668మంది బాధితులకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల పరిహారం చెల్లింపు జరక బ్యాంకు ఖాతాలకు తిరిగి వచ్చాయని వివరించారు. మొత్తం 3,54,634మంది బాధితులకు రూ. 525.59కోట్ల రుపాయల్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. మిగిలిన వారికి కూడా చెల్లింపులు కొనసాగుతాయని వివరించారు.

స్వచ్ఛంధంగా వదులుకున్నారు…

బుడమేరు వరదల్లో పెద్ద ఎత్తున ప్రజలు ముంపుకు గురయ్యారు. నగరంలోని ఆరు లక్షల మంది ప్రజలు వరద ముంపుకు గురయ్యారు. దాదాపు పది రోజుల పాటు వరద నీటిలో ఉండాల్సి వచ్చింది. సర్వం కోల్పోయిన వారు కొందరైతే, వాహనాలు, దుకాణాలు, వ్యాపారాలు కోల్పోయిన వారు మరికొందరు ఉన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు సెప్టెంబర్ రెండో వారంలోనే ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. 

దశల వారీగా నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి నష్టం అంచనా వేశాయి. చివరి బాధితుడి వరకు పరిహారం చెల్లించే వరకు విశ్రమించొద్దని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ప్రతి అభ్యంతరాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురు ముంపు బాధితులు స్వచ్ఛంధంగా తమ పరిహారాన్ని వదులుకున్నారు. తమకు వరదల్లో ఎలాంటి నష్టం వాటిల్లనందున పరిహారం అవసరం లేదని పేర్కొన్నారు. కొంతమంది వాహనాలకు చిన్నచిన్న మరమ్మతులు గురైనా వాటిని సొంతంగా బాగు చేయించుకున్నారు.  ఓ వైపు పరిహారం కోసం కొన్ని ప్రాంతాల్లో పరిహారం ఆందోళనలు జరిగితే మరికొన్ని చోట్ల పరిహారం అవసరం లేదన్న వారిని కూడా లెక్కింపులో గుర్తించారు. 

నగరంలోని వివిధ దశల్లో చేపట్టిన వరద నష్టం గణనలో పలు కుటుంబాలు తమకు పరిహారం అవసరం లేదని పేర్కొన్నాయి. ఇలాంటి కుటుంబాలు దాదాపు 80వేల వరకు ఉండొచ్చని సిఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వరదల్లో ప్రధానంగా ఒక అంతస్తులోపు మాత్రమే నివాసాలు ఉన్న వారికి ఎక్కువ నష్టం వాటిల్లింది. రెండో అంతస్తు ఉన్న వారికి వరద ముంపుకు గురి కాలేదు. మొదటి అంతస్తులోపు ఉన్న వారికి రూ.25వేలు, మొదటి అంతస్తు ఆపై ఉన్న వారికి రూ.10వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. ద్విచక్ర వాహనానికి రూ.3వేలు, ఆటోకు రూ.10వేలు చెల్లించారు. దుకాణాలు, పశువులు, కోళ్లు ఇలా అన్నింటికి లెక్క కట్టి పరిహారం చెల్లించారు. వరద నష్టం గణనలో పలు కుటుంబాలు తమకు ఎలాంటి నష్టం జరగలేదని, పరిహారం అవసరం లేదని పేర్కొనడాన్ని అధికారులు గుర్తించారు. ఇలాంటి కుటుంబాలు 80వేల వరకు ఉండొచ్చని, వరద నష్టం చెల్లింపు పూర్తైన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

పరిహారం అందక ఆందోళన

మరికొన్ని చోట్ల వరద పరిహారం అందక బాధితులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. పరిహారం చెల్లింపులో ఫ్యామిలీ యూనిట్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి సిబ్బంది పలు అంశాలను విస్మరించారు. ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్లకు చెల్లింపులు జరిపారు. ఉదాహరణకు ఓ కుటుంబంలో తల్లి ఆధార్‌ కార్డులో కుమారుడు మొబైల్ నంబర్‌ ఉండి, వేర్వేరుగా నివాసం ఉంటున్న ఒకరికే పరిహారం చెల్లించారు.

కొన్ని చోట్ల మొదటి అంతస్తులో ఉన్న వారికి రూ.10వేల పరిహారం మాత్రమే అందినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఆధార్‌ కార్డుతో బ్యాంకు ఖాతాలు లింక్‌ చేయని వృద్ధులకు పరిహారం అందలేదు. మహిళలకు బ్యాంకు ఖాతాల్లో ఓ ఇంటిపేరు, ఆధార్ కార్డులో మరో ఇంటి పేరు ఉంటే వారికి కూడా పరిహారం అందలేదు. రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలామందికి పుట్టింటి పేరుతో బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అలాంటి వారికి కూడా పరిహారం జమ చేయలేదు. తల్లి, కుమారుడు/కుమార్తెల ఆధార్‌ కార్డులకు ఒకే ఫోన్‌ నంబరుతో లింకైన వారు కూడా ఉన్నారు. దీంతో వేర్వేరుగా నివాసం ఉంటున్నా వారిలో ఒక్కరికే పరిహారం చెల్లించారు.

మొదటి, రెండో అంతస్తులో ఉండే కుటుంబాలను విడిగా నమోదు చేయకపోవడంతో చాలా చోట్ల తమకు పరిహారం అందలేదని బాధితులు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో పరిహారం చెల్లింపు పూర్తైతే లబ్దిదారుల ఖాతాలకు జరిపిన చెల్లింపుల వివరాలు పక్కాగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో కేవలం వాహనాలకు చెందిన పరిహారం మాత్రమే జమ చేశారు. ముంపుకు సంబంధించిన పరిహారాన్ని విస్మరించారు.

ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం…

అర్హ‌త ఉన్న ప్ర‌తి కుటుంబానికీ ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక స‌హాయం అందించాలనే లక్ష్యంతో ఈ నెల 22, 23వ తేదీల్లో మరోసారి క్షేత్రస్థాయిలో అర్జీలు స్వీకరించారు. విజయవాడలో 13,800 అర్జీలు వచ్చాయని.. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. దాదాపు 10,500 కుటుంబాలు ఆర్థిక సహకారానికి అర్హత పొందాయని, ఈ జాబితాను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.