BSNL Connections: ల్యాండ్‌ లైన్‌ ఫోన్లకు మంగళం.. బలవంతంగా తొలగిస్తున్న BSNL.. ఇకపై ఫైబర్ కనెక్షన్లే దిక్కు…-bsnl is forcibly removing landline connections fiber connections are option ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bsnl Is Forcibly Removing Landline Connections.. Fiber Connections Are Option

BSNL Connections: ల్యాండ్‌ లైన్‌ ఫోన్లకు మంగళం.. బలవంతంగా తొలగిస్తున్న BSNL.. ఇకపై ఫైబర్ కనెక్షన్లే దిక్కు…

Sarath chandra.B HT Telugu
Mar 18, 2024 05:30 AM IST

BSNL Connections: బిఎన్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్ల చరిత్ర కనుమరుగు కానుంది. ఫిక్సిడ్ ఫోన్‌ కనెక్షన్లను వినియోగదారులే రద్దు చేసుకునేలా బిఎస్‌ఎన్‌ఎల్‌ బలవంతం చేస్తోంది.పాడైన కనెక్షన్లను పునరుద్దరించకుండా వినియోగదారులే తప్పుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు.

ల్యాండ్‌ లైన్ కనెక్షన్ల తొలగింపుకు బిఎస్‌ఎన్‌ఎల్ ఒత్తిడి
ల్యాండ్‌ లైన్ కనెక్షన్ల తొలగింపుకు బిఎస్‌ఎన్‌ఎల్ ఒత్తిడి

BSNL Connections: బిఎన్‌ఎన్‌ఎల్‌ ల్యాండ‌‌ లైన్ ఫోన్లు ఇకపై చరిత్రకు పరిమితం కాబోతున్నాయి. దశాబ్దాలుగా ల్యాండ్‌లైన్‌ ఫోన్లతో ఉన్న అనుబంధాన్ని వినియోగదారులు బలవంతంగా తెంచుకోవాల్సి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అతి త్వరలో BSNL ల్యాండ‌‌ లైన్‌ సేవల్ని పూర్తిగా నిలిపేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏపీ టెలికాం సర్కిల్ పరిధిలో కాపర్‌ కనెక్షన్స్‌ తొలగించాలని ఎక్చేంజీలకు ఆదేశాలు అందాయి. కాపర్ లైన్ల స్థానంలో FTTH ఫైబర్ లైన్లను వేయాలని సూచిస్తున్నారు. . విజయవాడలో దాదాపు నాలుగైదు నెలలుగా చాలా ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లు Fixed Phones పనిచేయడం లేదు.

వినియోగదారులకు Customers బిల్లులు మాత్రం యథావిధిగా వస్తున్నాయి. ఫోన్లు పనిచేయక పోవడంపై వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నా సిబ్బంది స్పందించడం లేదు.ఫోన్లు పనిచేయక ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

పక్కా వ్యూహంతో కనెక్షన్ల తొలగింపు…

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిఎస్‌ఎన్‌ఎల్‌ BSNL ఇప్పటి వరకు నిర్వహించిన కాపర్ లైన్ కనెక్షన్లు Copper Lines ఇక భూగర్భంలో కలిసిపోనున్నాయి. దశాబ్దాలుగా ప్రతి వీధిలో నిర్మించుకుంటూ వచ్చిన కేబుల్‌ నెట్‌వర్క్‌లను మట్టిపొరల్లో శాశ్వతంగా కప్పేట్టేయాలని అత్యున్నత స్థాయిలో నిర్ణయించారు. ఇందులో భాగంగా కాపర్‌ కనెక్షన్లను ఫిక్సిడ్‌ ఫైబర్‌ లైన్లుగా మార్చాలని అన్ని సర్కిళ్లకు Telecom Circles, టెలికాం డిస్ట్రిక్‌లకు గతవారం ఉన్నత స్థాయిలో ఆదేశాలు అందాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ BSNL కనెక్షన్లను Connections తొలగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తే దానిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతాయనే ఉద్దేశంతో పాత కనెక్షన్లను పునరుద్దరించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారులకు Fiber Connections ఇస్తామని, పాత నంబర్లు కొనసాగుతాయని నచ్చ చెబుతున్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సర్వీస్ లేదని మెల్లగా చావుకబురు చెబుతున్నారు. విజయవాడ టెలికాం డిస్ట్రిక్ పరిధిలో దాదాపు 56వేల ల్యాండ్ లైన్‌ కనెక్షన్లు ఉన్నాయి.

జిల్లా వ్యాప్తంగా ఉన్న మేజర్ టెలికాం ఎక్చేంజీలను ఇప్పటికే సమీపంలోని ప్రధాన ఎక్చేంజీలలో కలిపేశారు. ఒక్కో జిల్లాలో సగటున 2వేల మంది కంటే ఎక్కువ ఉద్యోగులు లేరు. ఉన్న వారికి కూడా త్వరలో భారీ విఆర్‌ఎస్‌ స్కీం ప్రకటిస్తారనే అనుమానాలు ఉద్యోగుల్లో ఉంది.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ టెలికాం నుంచి 2000 సంవత్సరంలో BSNL బిఎస్‌ఎన్‌ఎల్ ఏర్పడిన తర్వాత రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలను బిఎస్‌ఎన్‌ఎల్ సమకూర్చుకుంది. గత పదేళ్లుగా తిరోగమనం పట్టింది. ప్రైవేట్ రంగంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ వ్యాప్తి చెందడం, ఫిక్సిడ్‌ ఫైబర్‌ కనెక్షన్లతో టెలికాం సేవలు కూడా మొదలు కావడంతో బిఎస్‌ఎన్‌ఎల్‌ డిమాండ్ తగ్గుతోంది.

గత రెండు మూడేళ్లుగా ప్రైవేట్ టెలికాం రంగంలో ఫైబర్‌తో పాటు ఓటీటీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో బిఎస్‌ఎన్‌ఎల్ మనుగడ కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు ఫైబర్‌ కనెక్షన్లను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో అతి త్వరలో ఉన్న కనెక్షన్లకు కాలం చెల్లుతుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాపర్ కనెక్షన్లను ఫైబర్‌నెట్‌వర్క్‌లోకి మార్చే క్లస్టర్స్ కూడా ఏర్పాటు కాకపోవడంతో కనెక్షన్ మార్పు ఉత్తి మాటనే వాదనలు కూడా ఉన్నాయి.

కనెక్షన్ మార్చరు, రిపేర్ చేయరు...

బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ల మరమ్మతుల కోసం గతంలో సొంత సిబ్బంది ఉండేవారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బందిని తగ్గించిన తర్వాత కేబుల్ నెట్‌వర్క్‌ను కాపాడుకోవడం దానికి పెద్ద సవాలుగా మారింది. గతంలో రోడ్లను తవ్వాలంటే బిఎస్‌ఎన్‌ఎల్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండేది. బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది సమక్షంలో రోడ్లను తవ్వడం చేసే వారు.

అనుమతి లేకుండా రోడ్లు తవ్వి, కేబుల్స్ పాడు చేస్తే అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేవారు. ప్రభుత్వ శాఖలైనా వాటి నుంచి భారీ జరిమానాలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఏ ఏరియాలో రోడ్లు తవ్వేసి కేబుల్స్‌ పాడవుతాయా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. కొత్త కనెక్షన్ల కోసం మార్కెట్‌లో ఉన్న ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటే బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఉన్నవాటిని వదిలించుకోడానికి ప్రయత్నిస్తోంది.

ల్యాండ్‌ లైన్ కాపర్ కనెక్షన్లను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో కసరత్తు జరుగుతోందని విలువైన ఎక్చేంజీ పరికరాలు స్క్రాప్‌లో అమ్మేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విజయవాడతో పాటు అన్ని నగరాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందని ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లను పునరుద్దరించే ఆలోచన యాజమాన్యంలో లేదని స్పష్టం చేస్తున్నారు.

విలువైన ఆస్తుల్ని విక్రయించేందుకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వేలం ప్రక్రియ ప్రారంభించినట్లు గుర్తు చేస్తున్నారు. విజయవాడ కొండపల్లిలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల వేలం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం