Bangalore Murders: వివాహేతర సంబంధంతో బెంగుళూరులో ఇద్దరి దారుణ హత్య, నిందితుడు ఆత్మహత్య.. మృతులు శ్రీకాకుళం వాసులు
Bangalore Murders: వివాహేతర సంబంధం మూడు ప్రాణాలను బలి తీసుకుంది. బెంగుళూరులోని భవన నిర్మాణ రంగంలో మేస్త్రీగా పనిచేస్తున్న వ్యక్తి భార్యతో అందులో పనిచేసే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త వారిని హత్య చేశాడు. హత్యానంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు.
Bangalore Murders: బెంగుళూరులో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు హత్యకు గురి కాగా, హత్యలకు పాల్పడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోణనకుంటె ఠాణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలు బెంగుళూరులో కలకలం రేపాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోలు గొల్లబాబు(45), కోలు లక్ష్మీ పైతమ్మ(40) దంపతులు ఉపాధి కోసం బెంగుళూరులో ఉంటున్నారు. వీరి వద్ద శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేశ్‌కుమార్ (20) కొన్నేళ్లుగా నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
వీరంతా కోణనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోన నివాసం ఉంటున్నారు. ఇటీవల కోణనకుంటె సోమేశ్వర లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న ఒక భవంతిలో ఇటీవల పనికి కుదిరారు. ఈ క్రమంలో గొల్లబాబు భార్య పైతమ్మతో గణేశ్ వివాహేతర సంబంధం గురించి తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో వారిపై దాడి చేశాడు.
కట్టెతో ఇద్దరినీ కొట్టి చంపేశాడు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన మరదలికి ఫోన్ చేసి భార్యను హత్య చేసినట్టు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల బంధువుల ఫిర్యాదు ఈ మేరకు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.