AP Crime : ఒక మహిళ.. ఇద్దరితో అక్రమ సంబంధం.. యువకుడు హత్య.. పొన్నూరు క్రైమ్ కథా చిత్రమ్ ఇదీ!
AP Crime : గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. మహిళతో అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఒక మహిళతో ఇద్దరికు వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాన్ని నడింపింది. ఆ విషయం బయటపడి గొడవ జరిగింది. ఈ వివాదంలో ఓ యువకుడిని హత్య చేశారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ములుకుదురు గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. పొన్నూరు రూరల్ ఎస్ఐ కిరణ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నూరు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన నక్కల దేవరాజ్ (34) విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ములుకుదురు గ్రామానికి చెందిన ఓ మహిళతో ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఆ మహిళ ములుకుదురు గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె విషయంలో దేవరాజ్, మాధవ్ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మాధవ్ కొంత మంది యువకులతో కలిసి దేవరాజ్‌పై దాడికి దిగాడు. ఇనుప రాడ్లతో బలంగా దాడి చేయడంతో దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గ్రామ శివారులోని ఓ మద్యం దుకాణం వద్ద పడేశారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ బాబు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడు దేవరాజ్ కుటుంబ సభ్యులు బాపట్ల- గుంటూరు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. తెనాలి డీఎస్పీ జనార్దన్‌రావు ఆందోళన చేసిన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
అత్తారింట్లో దొంగతనం..
అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. అత్తారింట్లో అల్లుడు దొంగతనం చేశాడు. అనారోగ్యంగా ఉన్న కుమార్తెను చూడటానికి వెళ్లి ఏకంగా ఆరు తులాల బంగారం కొట్టేశాడు. అల్లుడే దొంగతనం చేశాడని అత్తకు తెలియలేదు. అల్లుడుపై అనుమానం కూడా రాలేదు. సాధారణంగానే దొంగతనం జరిగిందని అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరిపారు. బంగారం దొంగతనం చేసిన వ్యక్తి సొంత అల్లుడేనని అప్పుడు అత్తకు తెలిసింది.
ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామంలో జరిగింది. ధర్మవరం రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన సాకే ఓబులమ్మ ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సమయంలో తన అల్లుడు చందమామ రవి ఇంటి తాళం పగులగొట్టి బీరువా తెరిచి 6.5 తులాల బంగారు నగలు ఎత్తు కెళ్లాడు.
దొంగతనం జరిగిందని ఓబులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపారు. ఓబులమ్మ అల్లుడు చందమామ రవినే దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసు విచారణలో బయటపడింది. ధర్మవరం మండలంలోని నాగులూరు బస్టాప్ వద్ద ఓబులమ్మ అల్లుడు చందమామ రవిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నుంచి 6.5 తులా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)