Visakhapatnam Attack: విశాఖ జిల్లాలో ఘోరం… ప్రేమించలేదని యువతిపై జమ్మూ నుంచి వచ్చిన యువకుడి దాడి
Visakhapatnam Attack: విశాఖపట్నం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించడానికి నిరాకరించిందని యువతిపై ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. జమ్మూ నుంచి విశాఖపట్నం వచ్చి రెక్కీ నిర్వహించి, హెల్మెట్ ధరించి రాడ్డుతో దాడి చేశాడు.అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి ఒడిగట్టాడు.
Visakhapatnam Attack: ప్రేమించలేదనే అక్కసుతో జమ్మూకు చెందిన యువకుడు విశాఖ యువతిపై దారుణంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి యత్నించాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన బాలచెరువుకాలనీలో చోటు చేసుకుంది. న్యూపోర్టు పోలీసులు కథనం ప్రకారం బాల చెరువుకాలనీకి చెందిన మేఘన (21) డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటుంది.
ఏడాది క్రితం సేవా కార్యక్రమాల నిమిత్తం రాజస్థాన్‌లోని మౌంట్ అబుకు వెళ్లింది. కొన్ని రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత, ఆమె జ్వరం బారిన పడింది. దీంతో వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమె చికిత్స పొందింది. అదే సమయంలో జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని ఉద్ధంపూర్‌కు చెందిన నీరజ్ శర్మ (28) కూడా అదే ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరారు. అక్కడే చికిత్స తీసుకున్న క్రమంలో మేఘనతో పరిచయం చేసుకుని ఫోన్ నెంబర్ సంపాదించాడు.
గతంలోనే పోలీసులు వార్నింగ్
రాజస్థాన్‌లో సేవ ముగించుకొని ఆమె స్వస్థలం విశాఖపట్నం చేరుకుంది. నీరజ్ శర్మ మాత్రం మేఘనకు ఫోన్‌లో కాంటాక్టు అయ్యేవాడు. మేఘనకు తరచూ ఫోన్ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకునేవాడు. ఈ క్రమంలో ఆమెకు వాట్సాప్‌లో ఫోటోలు కూడా పంపేవాడు. దీనికి మేఘన స్పందించి, తనకు ఇలాంటివి ఇష్టం లేదని స్పష్టం చేసింది. మేఘనా ఎంత చెప్పినప్పటికీ వినకుండా నీరజ్ శర్మ తన పాత వీడియోలు, అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధించేవాడు.
దీంతో విసుగు చెందిన మేఘన ఈ విషయం తన తల్లిదండ్రులకు వివరించింది. మేఘన తల్లిండ్రులు వెంటనే విశాఖపట్నంలోని న్యూపోర్టు పోలీసులకు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అప్పుడే నీరజ్ శర్మకు ఫోన్ చేసి హెచ్చరించారు.
రెండు రోజుల క్రితమే విశాఖ వచ్చి రెక్కీ
దీంతో కక్ష పెట్టుకున్న నీరజ్ శర్మ, మేఘనపై దాడికి కుట్ర పన్నాడు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్ నుంచి విశాఖపట్నం వచ్చి రెక్కీ నిర్వహించాడు. మేఘన ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందోనని వేచి చూశాడు. గురువారం మేఘన తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఇంట్లో మేఘన ఒక్కటే ఉండటంతో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని, నీరజ్ శర్మ హెల్మెట్ ధరించి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె ఉంటున్న గదిలోకి నేరుగా చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మేఘనపై దాడికి దిగాడు.
తల, భుజం, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె పెద్ద పెట్టున కేకలు వేసింది. ఆ కేకలు విని, పక్కింట్లో ఉంటున్న సాయికృష్ణ అనే వ్యక్తి అక్కడు వెళ్లాడు. నీరజ్ శర్మను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనపై కూడా నిందితుడు దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అదే ప్రాంతానికి చెందిన హోంగార్డు శ్రీను నిందితుడి నీరజ్ శర్మను పట్టుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు చిక్కలేదు.
నిందితుడి కోసం గాలింపు
తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తలపై బలమైన గాయం కావడంతో ఆమె 31 కుట్లు పడ్డాయి. చేతి చూపుడు వేలు తెగిపడిపోయింది. రెండు మోచేతులు ఛిద్రం అవ్వడం, గదంతా రక్తంతో నిండిపోయింది. సమాచారం తెలుసుకున్న జోన్-2 డీసీపీ మేరీ ప్రశాంతి, హార్బర్ ఏసీపీ కాళిదాస్, న్యూపోర్టు సీఐ దాలిబాబు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులను, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే ఘటనా స్థలానికి కూడా చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)