BRS in AP: కేసీఆర్ నిజంగానే అలా చేస్తారా..? జగన్ కు ఝలక్ తప్పదా..?
BRS Party in Andhrapradesh: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అత్యంత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు గులాబీ గూటికి చేరటంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు సంబంధించి మరో నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధానిగా అమరావతికే జై కొట్టనుందంటూ వార్తలు వస్తున్నాయి.
BRS Stand On Andhrapradesh Capital: బీఆర్ఎస్... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్..! ఎవరూ ఊహించని విధంగా ఏపీకి చెందిన కొందరు గులాబీ కండువా కప్పుకున్నారు. సరిగ్గా ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా ఆంధ్రా నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్... ఏపీలో పార్టీని ఎలా విస్తరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. విభజన హామీల విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏంటని నిలదీస్తున్నారు. మరోవైపు వ్యూహం ప్రకారమే జగన్ - కేసీఆర్ పావులు కదుపుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉన్న... బీఆర్ఎస్ విస్తరణ దిశగా అక్కడి నేతలు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభను కూడా తలపెట్టబోతున్నారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ కు సంబంధించి మరో వార్త... చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజధానిగా అమరావతికే జై కొట్టనుందని... త్వరలోనే నిర్ణయం ఉంటుందనే లీక్ లు బయటికి వస్తున్నాయి. సరిగ్గా ఈ పరిణామం... ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి వైపేనా..?
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించిన కేసీఆర్... ఇతర రాష్ట్రాల్లో విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఇక ఏపీలో అయితే యాక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడిని కూడా ప్రకటించిన కేసీఆర్... త్వరలోనే భారీ సభను తలపెట్టబోతున్నారు. అంతే కాదు పార్టీ ఆఫీస్ ను ఓపెన్ చేసే పనిలో కూడా ఉన్నారు. చేరిన నేతలు కూడా పార్టీ బలోపేతం దిశగా వర్కౌట్ చేస్తున్నారు. అయితే పార్టీ ఆఫీస్ ను కూడా విజయవాడలోనే ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని అంశం తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని పార్టీలు 3 రాజధానులకు సై అంటే... మరికొన్ని అమరావతికే సై అంటున్నాయి. ఈ అంశం వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏపీలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్...మూడు రాజధానుల వైపు ఉంటుందా... లేక అమరావతికే జై కొడుతుందా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ... అమరావతి వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయటం కూడా దీనికి ఓ సంకేతమని కొందరు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తోట చంద్రశేఖర్ కూడా... ఈ మధ్య ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వూలో అమరావతికే జై కొట్టారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమా..? లేక పార్టీ నిర్ణయాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారా అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది.
అదే జరిగితే జగన్ కు ఝలకే!
నిజంగా బీఆర్ఎస్ కనుక అమరావతికి జై కొడితే జగన్ కు ఝలక్ ఇచ్చినట్లే అవుతుంది. ఇదే సమయంలో చంద్రబాబు హ్యాపీగా ఫీల్ అవొచ్చు. అమరావతి విషయంలో పోరాటం కొనసాగిస్తూనే ఉన్న తెలుగుదేశానికి ఈ నిర్ణయం మరింత బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది. కానీ వైసీపీ మాత్రం ఇరకాటంలో పడటం స్పష్టమే అని వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే వైసీపీ- బీఆర్ఎస్ మధ్య గ్యాప్ రావటం ఖాయమనే చెప్పొచ్చు. నిజానికి ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ వెనక జగన్ - కేసీఆర్ మధ్య ఒప్పందం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పవన్ టార్గెట్ గా జనసేన ఓట్లు చీల్చిందుకే బీఆర్ఎస్ ను ఏపీలో విస్తరిస్తున్నారని, నేతలను కూడా చేర్పించారని పలువురు నేతలు కూడా బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కనుక అమరావతికి మద్దతు నిర్ణయం ప్రకటిస్తే మాత్రం... ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారొచ్చు.
మొత్తంగా తన వ్యూహలతో ఉకిరిబిక్కిరి చేసే కేసీఆర్... ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై కూడా ఓ క్లారిటీతోనే ఉండే అవకాశం ఉంటుంది. ఫలితంగా రాజకీయ ప్రత్యర్థులను ఇరుకునపెట్టే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకునే ఛాన్స్ ఉండదు. అమరావతి విషయంలో బీఆర్ఎస్ కు ఓ క్లారిటీ ఉండే అవకాశం లేకపోలేదు. నాడు స్వయంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరయ్యారు. ఈ పరిణామాన్ని కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకునే అవకాశం గులాబీ బాస్ కు ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు నిజంగా కేసీఆర్ అమరావతికి జై కొడుతారా..? లేక ఈ అంశం జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతారా అనేది కూడా తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి అంశమే కాకుండా పలు కీలకాంశాలపై కూడా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది చెప్పవచ్చు.