Namaste Andhra Pradesh : ఏపీలో “నమస్తే ఆంధ్రప్రదేశ్” అన్ని ప్రాంతీయ భాషల్లో బిఆర్ఎస్ పత్రికలు-brs party chief kcr plans to establish own news paper in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Brs Party Chief Kcr Plans To Establish Own News Paper In Andhra Pradesh

Namaste Andhra Pradesh : ఏపీలో “నమస్తే ఆంధ్రప్రదేశ్” అన్ని ప్రాంతీయ భాషల్లో బిఆర్ఎస్ పత్రికలు

ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్న బిఆర్ఎస్‌ పార్టీ పత్రిక నమస్తే ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్న బిఆర్ఎస్‌ పార్టీ పత్రిక నమస్తే ఆంధ్రప్రదేశ్

Namaste Andhra Pradesh ఏపీలో సొంత పత్రికను ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి నాయకత్వం భావిస్తోంది. నమస్తే తెలంగాణ పత్రిక తరహాలో ఏపీలో కూడా నమస్తే ఆంధ్రప్రదేశ్‌ పత్రికను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Namaste Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో మరో తెలుగు దిన పత్రిక అడుగు పెట్టనుంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్త దినపత్రికలేవి ఏపీలో కొత్తగా ఎంట్రీ ఇవ్వలేదు. ఉన్న పత్రికల్లో కొన్ని మనుగడ సాగించలేక మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందడంతో ఏపీలో కూడా కొత్త పత్రికను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఒక్క ఏపీలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బిఆర్‌ఎస్‌ పార్టీకి పుష్కర కాలం క్రితమే సొంత పత్రికను ఏర్పాటు చేసుకుంది. ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజల గొంతును బలంగా వినిపించే లక్ష్యంతో ఈ పత్రికను ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి పత్రికను ప్రారంభించడంతో ఏపీలో దాని విస్తరణ అవసరం లేకపోయింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. బిఆర్‌ఎస్‌కు చెందిన పత్రిక నమస్తే తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉండటం, ఆ పత్రిక ఆంధ్రాలో విస్తరించడానికి పరిమితులు ఉండటంతో కొత్త పత్రికను ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో ఏపీలో పత్రికను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ తరహాలో త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త పత్రికను ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పత్రిక ఏర్పాటు కోసం రిజిస్ట్రార్ ఆఫ్‌ న్యూస్ పేపర్‌ నుంచి రిజిస్ట్రేషన్ నెంబ‌ర్ వ‌చ్చేసింద‌ని, ప‌త్రిక‌కు సంబంధించిన ప్రింటింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మంచి ముహూర్తం చూసి నమస్తే ఆంధ్రప్రదేశ్‌ ప‌త్రిక‌ను ఏపీలో ప్రారంభించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. సొంత మీడియా వ్యవస్థ లేకపోతే ఏపీలో బిఆర్‌ఎస్‌ అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అవకాశాలు లేకపోవడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌, ఆశ‌యాల‌ను నెర‌వేర్చ‌డానికి ఉద్య‌మ స‌మ‌యంలో నమస్తే తెలంగాణ ప‌త్రిక కీల‌క పాత్ర పోషించింది. మిగిలిన మీడియా సంస్థల నుంచి పరిమితంగానే సహకారం అందినా సొంత పత్రిక, టీవీల ద్వారా తమ గళాన్ని వినిపించగలిగారు. ప్ర‌త్యేక తెలంగాణను సాధించడంతో సొంత మీడియా సంస్థలో కీలకంగా పనిచేశాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పార్టీ అజెండాను విస్తరించేందుకు సొంత మీడియా అవసరమని భావిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తెలుగుతో పాటు కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, హిందీ భాషల్లో సైతం పత్రికల్ని ప్రారంభించనున్నారు.

కేంద్రంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న కేసీఆర్‌ తెలుగు రాష్ట్రాల్లో సొంత ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మ గ‌ళాన్ని వినిపించేందుకు ఓ ప‌త్రిక అవ‌స‌ర‌మ‌ని భావించి పత్రిక ఏర్పాటుకు నిర్ణయించారు. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికి సొంత పత్రికలు ఉన్నాయి. బిఆర్‌ఎస్‌ను విస్తరించాలంటే సొంత మీడియా అవసరమని గుర్తించారు. లేకుంటే మిగిలిన పత్రికల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉంటుందనే ఉద్దేశంతో పేపర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎక్కువ రాష్ట్రాలకు పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు అన్ని ప్రాంతీయ భాషల్లో పత్రికలను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు సొంత టీవీ ఇప్పటికే ఉండటంతో పత్రికను కూడా ప్రారంభిస్తే లోటు తీరిపోతుందని భావిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పత్రిక ఎప్పట్నుంచి ప్రారంభిస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో బిఆర్‌ఎస్ ప్రారంభించనున్న పేపర్‌ ఎలా ఉంటుందనే విషయంలో జర్నలిస్ట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పొలిటికల్ అజెండాతోనే పేపర్ వస్తున్నా, మిగిలిన పత్రికల్ని ఎలా ఎదుర్కొంటుందనే దానిపై చర్చ సాగుతోంది. తెలుగుతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏక కాలంలో ప్రాంతీయ భాషల్లో పత్రికలను ప్రారంభించి దూకుడు పెంచాలని యోచిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్