ఇద్దరు బావమరుదులను బరిసేతో చంపేసిన బావ.. అసలు ఏం జరిగింది? 11 ముఖ్యమైన అంశాలు-brother in law kills siblings in alluri seetharamaraju district 11 key points ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఇద్దరు బావమరుదులను బరిసేతో చంపేసిన బావ.. అసలు ఏం జరిగింది? 11 ముఖ్యమైన అంశాలు

ఇద్దరు బావమరుదులను బరిసేతో చంపేసిన బావ.. అసలు ఏం జరిగింది? 11 ముఖ్యమైన అంశాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బావమరుదులను బావ దారుణంగా చంపేశాడు. తన భార్యను తీసుకెళ్తున్నారని.. క్షణికావేశంలో బరిసేతో దాడి చేశాడు. దీంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అల్లూరి జిల్లాలో హత్య (unsplash)

బావ ఇద్దరు బావమరుదులను హతమార్చిన దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి వరకూ అందరూ కలిసి మద్యం తాగిన తర్వాత.. గొడవ జరిగింది. ఈ గొడవలో బావ బరిసేతో తన బావమరుదులను చంపేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 11 అంశాలు ఇలా ఉన్నాయి.

11 అంశాలు..

1.గూడెంకొత్తవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధి చింతపల్లి క్యాంపునకు చెందిన కిముడు కృష్ణ (52) ఒడిశాలోని కటక్‌లో, కిముడు రాజు(38) విశాఖపట్నంలో జీవనం సాగిస్తున్నారు.

2.ఈ ఇద్దరికి పెద్దమ్మ వరసైన మామిడి సీతమ్మ.. శనివారం చింతపల్లి క్యాంపులో చనిపోయింది. ఈమె అంత్యక్రియల నిమిత్తం వీరు ఆదివారం స్వగ్రామం వచ్చారు.

3.సీతమ్మ అంత్యక్రియలు జరిగిన తర్వాత రాజు, కృష్ణ తిరిగి వారివారి ఇళ్లకు బయలుదేరారు. ఈ సమయంలో నిందితుడు గెన్నూ వారిని సీలేరు తీసుకొచ్చారు.

4.ఇద్దరు అన్నదమ్ములు రాజు, కృష్ణ, బావ గెన్ను.. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత చింతపల్లి క్యాంపులో మరోసారి మద్యం తాగారు.

5.అర్ధరాత్రి 12 గంటల సమయంలో గెన్నూ ఇంటికి వచ్చాడు. తన భార్య మణితో గొడవపడి ఆమెను కొట్టాడు. దీంతో తమ అక్కను ఎందుకు కొట్టావని బావమరుదులు నిలదీశారు.

6.తమ అక్కను ఇబ్బందులు పెడుతున్నావని.. రాజు, కృష్ణ ప్రశ్నించారు. అక్కను తమ ఇంటికి తీసుకెళ్లిపోతామంటూ.. బైక్ దగ్గరకు వెళ్లారు.

7.ఈ క్రమంలో గెన్నూ కోపంతో తన ఇంట్లో ఉన్న బరిసె తీసుకొచ్చి రాజు, కృష్ణపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన కిముడు రాజుపైనా దాడిచేశాడు.

8.అన్నదమ్ములు రాజు, కృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కిముడు రాజుకు తీవ్ర గాయాల అయ్యాయి. అతడికి చింతపల్లి, నర్సీపట్నం ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.

9.ఇదంతా జరగ్గానే నిందితుడు గెన్ను పరారయ్యాడు. గెన్నూ భార్య మణి విషయంలో బావమరుదులతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా వారిని హతమార్చినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.

10.నిందితుడు గెన్నూకు నేర చరిత్ర ఉంది. గతంలో ఓ హత్య కేసులో పదేళ్ల జైలుశిక్ష అనుభవించి విడుదలయ్యాడు. చింతపల్లి క్యాంపులో ఒకరిని హత్య చేయగా.. గ్రామస్థులు అందరూ ఒక్కటై కేసు లేకుండా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

11.మృతుడు కృష్ణ భార్య పూర్ణిమ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య జరిగిన స్థలాన్ని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోత్‌ మిశ్రా పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత కథనం