Brookfield investments: ఏపీలో క్లీన్ ఎనర్జీలో బ్రూక్‌ఫీల్డ్‌ భారీ పెట్టుబడులు, 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-brookfields largest investment in clean energy in ap 5 billion dollars investment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Brookfield Investments: ఏపీలో క్లీన్ ఎనర్జీలో బ్రూక్‌ఫీల్డ్‌ భారీ పెట్టుబడులు, 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

Brookfield investments: ఏపీలో క్లీన్ ఎనర్జీలో బ్రూక్‌ఫీల్డ్‌ భారీ పెట్టుబడులు, 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

Sarath chandra.B HT Telugu
Aug 21, 2024 01:41 PM IST

Brookfield investments: పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్య స్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 5 బిలియన్ డాలర్లను గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు , గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ ఎవ్రెన్ ముందుకొచ్చాయి.

బ్రూక్‌ఫీల్డ్‌ప్రతినిధులతో చర్చిస్తున్న చంద్రబాబు
బ్రూక్‌ఫీల్డ్‌ప్రతినిధులతో చర్చిస్తున్న చంద్రబాబు

Brookfield investments: ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ బృందాలు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటిలో 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని, 2026 చివరి నాటికి ఆ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని తెలిపారు.

పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళికలతో పాటు ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, ఈ -మొబిలిటీ, గ్రీన్ అమ్మోనియా వంటి వాటిలో రాష్ట్రంలో అదనపు అవకాశాలను ఎవ్రెన్ అన్వేషిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనువైన విధానాలను అమలుచేస్తోందని , పెట్టుబడిదారులకు, ప్రజలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సమయానుకూల అనుమతులతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు , రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని చంద్రబాబు చెప్పారు.

ఇంధన రంగం లో పెట్టుబడులను సాకారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నూతన అవకాశాలకు, ఉద్యోగ కల్పనకు , స్థిరమైన అభివృద్ధి సాదించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని మంత్రి గొట్టిపాటి వివరించారు.

సౌర, పవన ఇంధన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఏపీ లో ఆకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీ మంత్రి విదేశీ ప్రతినిధులకు వివరించారు. సోలార్ పార్కులు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లు, పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

సుమారు 1 ట్రిలియన్ యు ఎస్ డాలర్ల తో ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది ఉద్యోగులతో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ లో బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ లీడర్‌గా ఉందని బ్రూక్ ఫీల్డ్ అధికారులు తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్ పునరుత్పాదక ఇంధనాన్ని , ప్రపంచ ఇంధన పరివర్తన , వాతావరణ పరివర్తన కు సంబందించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి 100 బిలియన్ యూఎస్ డాలర్లతో ఐదు ఖండాలలో విస్తరించి ఉన్న హైడ్రో, పవన, సౌర, స్టోరేజి , విద్యుత్ పంపిణి వంటి వాటి లో 7,000 కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పాదక సౌకర్యాలలో 33,000 మెగావాట్లకు మించి ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉందన్నారు.

బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్ 5 ఖండాలలో విస్తరించి ఉన్న బహుళ పునరుత్పాదక సాంకేతికతలలో 155,000 మెగావాట్ల గ్లోబల్ డెవలప్మెంట్ పైప్‌లైన్‌ను కలిగి ఉందన్నారు. బ్రూక్‌ఫీల్డ్ సంస్థ, దశాబ్దానికి పైగా నైపుణ్యం కలిగిన క్లీన్‌టెక్ కంపెనీ అయిన యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని , 2019లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసి , 1.8 GW సౌర, పవన ప్రాజెక్టులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని తెలిపారు . దేశంలో క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్‌లను ముందుకు తీసుకు వెళ్లేందుకు బ్రూక్‌ఫీల్డ్ మరియు యాక్సిస్ ఎనర్జీ మధ్య 51:49% హోల్డింగ్ తో ఎవ్రెన్ సంస్థ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

ఉద్యోగాల కల్పన , పన్ను సహకారం ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు ఎంతగానో తోడ్పడతాయని, . ఈ పెట్టుబడి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ లో ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం , ప్రపంచ ఇంధన పరివర్తనకు సహాయపడడంలో ఎవ్రెన్ నిబద్ధతను తెలియచేస్తుందని , అలాగే క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను వారి ప్రధాన గమ్యస్థానంగా మారుస్తుందని బ్రూక్‌ఫీల్డ్ అధికారులు పేర్కొన్నారు.