CRDA Employees: రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు లంచాల డిమాండ్, కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు
CRDA Employees: రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వ పిలుపుతో భూములిచ్చిన రైతులకు తమ వాటా కింద దక్కాల్సిన ఫ్లాట్లను కేటాయించడానికి కూడా సీఆర్డిఏ ఉద్యోగులు వేధిస్తున్నారు. అడిగినంత లంచం ఇవ్వకపోతే ఏదొక కొర్రీ వేసి ఫ్లాట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.ఈ వ్యవహారంపై సీఆర్డీఏ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
CRDA Employees: లంచాలు మరిగిన సీఆర్డీఏ ఉద్యోగులు రైతుల ఫ్లాట్లను రిజిస్టర్ చేయడానికి లంచాలు డిమాండ్ చేస్తూ వేధించడం కలకలం రేపింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ వారి వాటా ఫ్లాట్ల కేటాయింపు పూర్తి కాలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇలా రిజిస్ట్రేషన్ కోసం సీఆర్ఢీఏ అధికారులకు దరఖాస్తు చేస్తున్న రైతుల నుంచి ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తున్న ఆడియోలు వైరల్‌గా మారాయి.
సీఆర్‌డిఏ పరిధిలో రైతులకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి కొందరు ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తూ వేధించిన ఆడియోలు వెలుగు చూవాయి. లంచాలు చెల్లించని వారికి రకరకాల సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకుంటున్నారు.
అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కుమారుడికి, సీఆర్డీఏ కంప్యూటర్ ఆపరేటర్ ఆశోక్ మధ్య డబ్బు డిమాండ్ చేస్తూ సాగిన సంభాషణ వైరల్ అయ్యింది. అబ్బరాజుపాలేనికి చెందిన భోగినేని కోటేశ్వరావు ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని నిర్మాణం కోసం 1.5 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రతిగా ఆయనకు సీఆర్డీఏ 1,500 చదరపు గజాల నివాస స్థలం, 360 చదరపు గజాల వాణిజ్య ప్లాట్లను కేటాయించింది.
కోటేశ్వరరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోటేశ్వర రావు, అతని కుమార్తెలు కోవిడ్ సమయంలో మృతి చెందారు. తనతో పాటు తన సోదరి కుమారుల పేర్లపై ప్లాట్లను బదిలీ చేయాలని రైతు కుమారుడు సుధీర్ సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం సీఆర్డీఏలో అబ్బరాజు పాలెం, బోరుపాలెం గ్రామాల రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్న అశోక్‌ను సంప్రదించగా, అతడు రూ. లక్ష లంచం ఇవ్వాలని అడిగాడు.
ఆ తర్వాత పలుమార్లు లంచం తగ్గించాలని కోరడంతో తనకు ఎంత ఇచ్చినా, పై అధికారికి రూ.50వేలు ఇవ్వాలని సూచించాడు. ఈ సంభాషణ శనివారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆడియో వెలుగు చూసిన తర్వాత పలువురు రైతులు తమ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చారు. నెలల తరబడి రిజిస్ట్రేషన్ చేయకుండా వివాదాలు సృష్టిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏలో కిందిస్థాయి ఉద్యోగులు లంచాల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయిః
భూములిచ్చిన రైతులకు దక్కాల్సిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రైతుల వాటాగా ఇచ్చే ప్లాట్లను తల్లిదండ్రుల నుంచి కుమారులు, కుమార్తెలకు ఉచి తంగా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. సాంకేతిక కారణాలు ఉన్నా, వాస్తవ రైతులు మరణించినా వారికి రిజిస్ట్రేషన్లు చేయకుండా లంచాలు డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి నిర్మాణం కోసం దాదాపు 29వేల మంది రైతులు భూములను అప్పగించారు. వారిలో చాలామందికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడంతో రోజూ కనీసం 300 రిజిస్ట్రేషన్లు చేయాలని సీఆర్‌డిఏ కమిషనర్ ఆదేశిం చారు. ఉద్యోగులు మాత్రం అరకొరగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇంకా 17,452 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది.
రైతులను లంచం కోసం డిమాండ్ చేసిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన సీఆర్‌డిఏ కమిషనర్, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ వెనుక ఉన్న వారిని కనిపెట్టాలని ఏసీబీకి రాసిన లేఖలో కోరారు.