Amaravati Works : రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు బ్రేక్.. కారణాలు ఇవే!
Amaravati Works : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కానీ అంతలోనే బ్రేక్ పడింది. అందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. అవును.. ఎన్నికల కోడ్ అమరావతి పనులకు అడ్డింకిగా మారింది. దీనిపై సీఆర్‌డీఏ ఈసీకి లేఖ రాసింది.
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ గత నెలలో పెద్ద ఎత్తున బిడ్లు ఆహ్వానించాయి. వీటిలో చాలా పనులకు గడువు ముగిసింది. మరికొన్నింటిని 7వ తేదీన తెరవాల్సి ఉంది. బిడ్లను తెరిచి ఖరారు చేసే దశలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో టెండర్ల ఖరారు, కొత్తవి పిలిచే ప్రక్రియకు బ్రేక్ పడింది.
ప్రభుత్వం ప్రణాళిక..
రాజధాని అమరావతిలో వివిధ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలోని లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, ఇంటర్నెట్ తీగలు వేసేందుకు డక్ట్‌ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే కాకుండా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస భవనాల్లో విద్యుత్, ప్లంబింగ్, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ వంటి పనులు చేపట్టనున్నారు.
త్వరలో తొలి విడత రుణం..
మిగిలిపోయిన వరద నియంత్రణ పనులు, రోడ్లు, సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల బాటల అభివృద్ధి, వీధి దీపాలు అమర్చడం వంటి పనులకు సంబంధించి.. మొత్తం రూ. 14,185 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో సీఆర్‌డీఏవి రూ.8,477.30 కోట్లు కాగా.. ఏడీసీఎల్‌వీ రూ.6,397 కోట్లు. పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అటు త్వరలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి తొలి విడద రుణం అందనుందని అధికారులు చెబుతున్నారు.
పనులు ప్రారంభించడానికి..
ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే కాంట్రాక్టర్లను ఖరారు చేసి.. పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే.. వచ్చేనెల 3వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఇప్పుడు సమస్యగా మారింది. దీంతో పనుల ప్రాధాన్యత దృష్ట్యా టెండర్ల ప్రక్రియకు అడ్డంకులు లేకుండా చూడాలని.. సీఆర్‌డీఏ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కేవలం పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు అయినందున.. నియామాలు సడళించాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతి వస్తే.. వేగంగా..
తాము రాసిన లేఖ పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అనుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో రూ.40 వేల కోట్లకు సంబంధిన పనులను దశల వారీగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా టెండర్లు పిలిచేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో ఏపీ అసెంబ్లీ, సచివాలయం, ఐకానిక్ టవర్ల బిడ్‌లు తెరవనున్నారు. ఈసీ ప్రక్రియకు అనుమతి ఇస్తే.. వేగంగా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.