Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హ‌త‌మార్చిన ప్రియుడు-boyfriend kills girlfriend father in nellore district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హ‌త‌మార్చిన ప్రియుడు

Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హ‌త‌మార్చిన ప్రియుడు

HT Telugu Desk HT Telugu
Jan 26, 2025 07:20 PM IST

Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోర‌ం జరిగింది. ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయ‌లేద‌నే క‌క్ష‌తో.. ఆమె తండ్రిని ప్రియుడు హ‌త‌మార్చాడు. క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ప్రియురాలి త‌ల్లి ఫిర్యాదు మేరకు ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య కేసు న‌మోదు చేశారు.

నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హ‌త‌మార్చిన ప్రియుడు
నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హ‌త‌మార్చిన ప్రియుడు

నెల్లూరు న‌గ‌రంలోని శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌లో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. నెల్లూరు న‌గ‌రంలోని జాకీర్ హుస్సేన్ న‌గ‌ర్‌లో మ‌హ‌బూబ్ బాషా (54), క‌రిమున్నీసా దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. వీరు బిస్కెట్లు, రొట్టెలను త‌యారు చేసి బేక‌రీల‌కు స‌ర‌ఫ‌రా చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే వీరి కుమార్తె, అదే ప్రాంతానికి చెందిన షాహిద్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

yearly horoscope entry point

ఏడాది కిందట నిశ్చితార్థం..

దీంతో వీరికి వివాహం చేసేందుకు ఏడాది కిందట నిశ్చితార్థం జ‌రిగింది. షాహిద్ ప‌నుల‌కెళ్ల‌కుండా స్నేహితుల‌తో జులాయిగా తిరుగుతుండ‌టంతో.. వివాహానికి మ‌హ‌బూబ్ బాషా నిరాక‌రించారు. పెళ్లి చేయాల‌ని షాహిద్ పలుమార్లు అడిగాడు. అలాగే పెద్ద‌ల చేత కూడా ఒత్తిడి తెచ్చాడు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. జులాయిగా తీర‌గ‌డంతో త‌న కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు మ‌హ‌బూబ్ బాషా స‌సేమీరా అన్నారు. దీంతో ప్రియురాలి తండ్రి బాషాపై షాహిద్ క‌క్ష పెంచుకున్నాడు.

అదును కోసం..

ఎలాగైనా త‌న ప్రియురాలి తండ్రిని అడ్డు తొల‌గించుకోవాల‌ని, అప్పుడే పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని షాహిద్ భావించాడు. అదును కోసం షాహిద్ ఎదురుచూశాడు. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం ప‌ని నిమిత్తం శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌కు మ‌హ‌బూబ్ బాషా వెళ్లారు. ప‌ని ముగించుకుని అక్క‌డి నుంచి ఇంటికెళ్తుండ‌గా.. శ్రీ‌నివాస‌న‌గ‌ర్ రెండో వీధిలో ఆగారు. అక్క‌డికి వెళ్లిన‌ షాహిద్ ఆయ‌న‌ను అడ్డుకున్నాడు. తాను తెచ్చుకున్న క‌త్తి తీసి బాషాపై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశాడు. ప‌లుమార్లు క‌త్తితో పొడిచి ప‌రార‌య్యాడు. బాషా తీవ్రంగా గాయ‌ప‌డి అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. స్థానికులు గమ‌నించి ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

పోలీసుల అదుపులో నిందితుడు..

కొన ఊపిరితో ఉన్న మ‌హ‌బూబ్ బాషా కొద్ది సేప‌టికే ఆసుప‌త్రిలో మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న న‌వాబ్‌పేట ఎస్ఐ అన్వ‌ర్ బాషా.. త‌న సిబ్బందితో హుటాహుటిన ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్నారు. మృతదేహాన్ని ప‌రిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను, స్థానికుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. క‌రిమున్నీసా ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని ఎస్ఐ అన్వ‌ర్ బాషా తెలిపారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner