Tirupati Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకు హత్య.. ఈత నేర్పిస్తానన తీసుకెళ్లి..
Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి, ఆమె ఆస్తిని చేజిక్కించుకోవడానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియురాలి కొడుకును హత్య చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈత నేర్పిస్తానని కాలువ వద్దకు తీసుకెళ్లిన ప్రియుడు, ఆయన స్నేహితుడు.. బాలుడిని కాలువలో ముంచి చంపేశారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి గ్రామంలో దారుణం జరిగింది. చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన బాలుడు కాతారి లాసిక్ (11) ఈనెల 7న కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. మరసటి రోజు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మ పాలెం వద్ద కండలేరు కాలువలో శవమై తేలాడు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణలో ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన కాతారి అనీల్‌కు.. బాలుడి తల్లితో వివాహేతర సంబంధం ఉంది. ఆమె ఆస్తిపై అనీల్ కన్నేశాడు. ఎలాగైన ఆస్తి సొంతం చేసుకోవాలనుకున్నాడు.
బాలుడి తల్లితో ఉన్న వివాహేతర సంబంధాన్ని అడ్డుపెట్టుకుని.. ఆమెకున్న ఆస్తిని సొంతం చేసుకునేందుకు తనతో వచ్చి ఉండమని బాలుడి తల్లిని అనీల్ కోరాడు. బిడ్డను వదలి రాలేనని చెప్పడంతో.. ఆమె కుమారుడు లాసిక్‌ను హతమార్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని.. వరగలి గ్రామానికి చెందిన బైనా చరణ్ సాయంతో సమీపానున్న ఉప్పుటేరు వద్దకు ఈత నేర్పిస్తామని తీసుకెళ్లారు.
ఈత నేర్పించే క్రమంలో లాసిక్‌ను ఇద్దరు కలిసి నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆ తరువాత తమకు ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయారు. కొడుకు ఎంతకీ రాకపోవడంతో తల్లి కంగారు పడింది. పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వద్దకు వెళ్లినప్పడు, ఆమెతో పాటు ప్రియుడు కూడా ఉన్నాడు. తనకు ఏమీ తెలియనట్లు నటించాడు. పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అనంతరం విచారణ ప్రారంభించారు. బాలుడు మరసటి రోజు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మ పాలెం వద్ద కండలేరు కాలువలో శవమై తేలాడు. విచారణ వేగవంతం చేయడంతో అసలు విషయాలు బటయపడ్డాయి. అదృశ్య కేసు కాస్త హత్య కేసుగా మారింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడిని ప్రియుడే హత్య చేస్తాడని అనుకోలేదని, ఇంతటికి క్రూరత్వానికి దిగజారుతాడని అనుకోలేదని బాలుడి తల్లి కన్నీరుమున్నీరు అయింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)