Visakha MLC Election 2024 : సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న వైసీపీ - ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!
Visakha MLC Election 2024 : విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స అధికారుల నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు.
Visakha Mlc Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించటంతో పాటు నామినేషన్ వేసిన మరో అభ్యర్థి కూడా విత్ డ్రా అయ్యారు. ఫలితంగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.
జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స సత్యనారాయణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు బీఫాం ఇచ్చి.. గెలిపించిన పార్టీ అధినేత జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో అందరం ఇదే విధంగా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తామని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బొత్స ఎన్నికకు లైన్ క్లియర్ అయిపోయింది.
నిజానికి ఈ సీటను వైసీపీ అత్యంత సవాల్ గా తీసుకుంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులను అలర్ట్ చేసింది.
స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ నేరుగా రంగంలోకి దిగి… నేతలతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాతే సీనియర్ నేతగా ఉన్న బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావించడంతో వైసీపీ గెలుపు నల్లేరు మీదగా మారిపోయింది. కూటమి దూరంగా ఉండటంతో పాటు స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది.
బొత్స విజయంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నింపినట్లు అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో పూర్తిగా డీలా పడిపోయిన వైసీపీకి… ఈ విజయం కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.
టాపిక్