NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ ఏడాది బోర్డు పరీక్షలే.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
NO CBSE Exams: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ విద్యా విధానానికి శ్రీకారం చుట్టినా విద్యార్థుల్ని అందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేయకపోవడంతో వారు నష్టపోయే పరిస్థితులు ఉండటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ బోర్డుతోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
NO CBSE Exams: కనీస అవగాహన లేకుండా ఏపీలో ఒకేసారి వెయ్యి స్కూళ్ల లో సిబిఎస్ఈ పరీక్షా విధానం ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ఇప్పుడు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలో గుర్తించారు. సీబీఎస్‌ఈ బోధన దశల వారీగా ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది వెయ్యి స్కూళ్లలో విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.
సిబిఎస్ఈ పరీక్షా విధానంలో బోధించే టీచర్లు లేకుండానే వైసిపి ప్రభుత్వ హడావిడి నిర్ణయాలు తీసుకుందని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల ఇంటర్నల్ అసెస్మెంట్ లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయని, సిబిఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్లో 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1000 స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించారు. 2025-26 విద్యాసంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
బోధనలో వ్యత్యాసాలు…
వైసిపి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఒక్కసారిగా వెయ్యి స్కూళ్లను సిబిఎస్ఈ పరీక్షా విధానానికి మార్చిందని, రాష్ట్ర పరీక్షలకి, సిబిఎస్ఈ పరీక్షా విధానానికి వ్యత్యాసం ఉంటుందని ఉపాధ్యాయులు సిబిఎస్ఈ పరీక్షా విధానంలో భోధన చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.
విద్యార్థులను కూడా ఫౌండేషన్ స్థాయి నుండే సిబిఎస్ఈ పరీక్షా విధానానికి సన్నద్ధం చెయ్యాల్సి ఉన్నా అటువంటి చర్యలు ఏమీ చేపట్టకుండానే నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి వెయ్యి స్కూళ్లను సిబిఎస్ఈ పరీక్షా విధానం లోకి మార్చాలని నిర్ణయం తీసుకొని హడావిడిగా అమలు చేశారని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ ఏడాది ఈ వెయ్యి స్కూల్స్ లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడటం, విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తరువాత సిబిఎస్ఈ సమస్యను అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సిబిఎస్ఈ పరీక్షా విధానం అమలు పై ఉన్నత అధికారులతో అనేక సమీక్షలు నిర్వహించిన తరువాత మంత్రి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
80వేల ట్యాబ్‌లతో విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు..
సుమారుగా 80 వేల ట్యాబ్ లతో దేశంలో మొదటి సారి ఇంటర్నల్ అసెస్మెంట్‌ను విద్యా శాఖ నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలతో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. 90 శాతం విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్ లో ఫెయిల్ అయ్యారు. 326 స్కూళ్ల లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. 1- 25 శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 556, 26- 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 66, 51-75 శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 37, 76-99 శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 14, 100 శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ ఒకే ఒక్కటి ఉంది.
ఇంగ్లీష్‌లో, మ్యాథ్స్‌లో ఘోరం..
77,478 మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రాయగా 59,518 మంది టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు. మ్యాథ్స్ పరీక్ష 77,478 మంది రాయగా 56,213 మంది టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు. సైన్స్ 77,478 రాయగా 49,410 మంది పరీక్షలో ఫెయిల్ అయ్యారు. సోషల్ స్టడీస్ లో 77,478 మంది పరీక్ష రాయగా 48,766 మంది ఫెయిల్ అయ్యారు. సిబిఎస్ఈ పరీక్షా విధానం బోధించే శిక్షణ ఉపాధ్యాయులకు ఇవ్వలేదు, విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాసి పాస్ అయ్యే పరిస్థితి లేదు.
ఇంటర్నల్ అసెస్మెంట్ లో వచ్చిన ఫలితాలను విద్యశాఖ ఉన్నతాధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో చర్చించిన తరువాత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ 1000 స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్టేట్ బోర్డు విధానంలో పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.
2025-26 విద్యాసంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సిబిఎస్ఈ పరీక్షా విధానంలో ఫెయిల్ అయితే విద్యార్థులపై ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. సమాజం వారిని ఫెయిల్యూర్స్ గా చూస్తుంది. అందుకే విద్య శాఖలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలని లోకేష్ అధికారులతో అన్నారు.
2025-26 విద్యాసంవత్సరం 6వ తరగతి నుండి పరీక్షా విధానంలో తీసుకొచ్చే మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సామర్ధ్య పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. టోఫెల్ టీచ్ చేసే టీచర్లు లేకపోయినా టోఫెల్ తీసుకొచ్చాం అని చెప్పుకోవడం, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే ఐబి సిలబస్ తీసుకొచ్చేస్తున్నాం అంటూ పబ్లిసిటీ ఇలా ఒక్కటేంటి విద్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా 5 ఏళ్ల పాలనలో లక్షల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. .
విద్య వ్యవస్థలో హడావిడి నిర్ణయాల వలన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని అవసరమైన సమూల మార్పులు విద్యాశాఖలో తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చెయ్యాలని లోకేష్ అధికారులను ఆదేశించారు.