Blast In Police Station : పోలీస్‌ స్టేషన్‌లో పేలుడు….-blast in chittore district gangadhara nellore police station ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Blast In Chittore District Gangadhara Nellore Police Station

Blast In Police Station : పోలీస్‌ స్టేషన్‌లో పేలుడు….

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 09:12 AM IST

Blast In Police Station చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో పేలుడు చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంతో నల్లమందు పేలి స్టేషన్‌ పాక్షికంగా ధ్వంసమైంది. నాలుగేళ్ల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకున్న నల్లమందును చెట్టు కింద పాతి పెట్టడంతో పేలుడు జరిగినట్లు గుర్తించారు.

గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో పేలుడు
గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో పేలుడు

Blast In Police Station చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో తెల్లవారు జామున పేలుడు సంభవించింది. తెల్ల వారు జామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్టేషన్‌ బయట పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో స్టేషన్‌ అద్దాలు, తలుపులు ఊడిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

Blast In Police Station చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌ శనివారం వేకువ జామున భారీ పేలుడు సంభవించింది. స్టేషన్ ఆవరణలో ఉన్న చెట్టు కింద పెద్ద గొయ్యి ఏర్పడి రాళ్ల తాకిడికి సమీపంలో ఉన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు జరగడంతో పోలీస్ స్టేషన్‌లో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. స్టేషన్ వెలుపల ఉన్న మర్రి చెట్టు కింద పాతిపెట్టిన నల్లమందు వల్ల పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 2018 జూన్‌లో గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో 213 కిలోల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 250గ్రాముల గన్‌పౌడర్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. మిగిలిన పేలుడు పదార్ధాన్ని లైసెన్స్‌డ్‌ గోడౌన్‌కు తరలించారు.

ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తైన తర్వాత తిరిగి వచ్చిన నల్లమందును స్టేషన్‌ ఆవరణలో ఉన్న చెట్టు కింద పాతిపెట్టినట్లు గుర్తించారు. నాలుగేళ్ల తర్వాత నల్లమందు ఒత్తిడికి గురవడంతో ఒక్కసారిగా పేలిపోయినట్లు డిఎస్పీ సుధాకర్‌ రెడ్డి చెబుతున్నారు. సాధారణంగా పేలుడు పదార్ధాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాతే భద్రపరుస్తారని ఘటన ఎలా జరిగిందో పూర్తి విచారణలో తెలుస్తుందంటున్నారు.

పేలుడు జరిగిన ప్రాంతంలో పగటి పూట పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారులు వేచి ఉంటారు. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్‌ ఆవరణలో నిర్లక్ష్యంగా పేలుడు పదార్ధాలను పాతి పెట్టడంపై దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ చెప్పారు.

మరోవైపు ఇటీవల గోదావరి జిల్లాలో సైతం ఇలాంటి ఘటన జరిగింది. స్టేషన్లో భద్రపరిచిన మందుగుండు సామాగ్రి పేలి పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. ఆ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లో టాపకాయలు, జిలెటిన్ స్టిక్స్‌, వివిధ కేసుల్లో పట్టుబడిన పేలుడు పదార్ధాలను నిల్వ చేయొద్దని సర్క్యులర్ జారీ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న పేలుడు వస్తువుల్ని సమీపంలోని లైసెన్స్డ్ గోడౌన్లలో భద్రపరచాలని ఆదేశించారు.

గంగాధర నెల్లూరులో చెట్టు కింద పాతిపెట్టిన నల్లమందు పేలడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అక్కడ నల్లమందు పాతిపెట్టిన సంగతి మర్చిపోయి ఉంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. స్వల్ప మొత్తంలోనే అక్కడ ఉంచడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని చెబుతున్నారు.

IPL_Entry_Point