Black Magic : చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని మోసం… -black magician cheated woman in ntr district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Black Magician Cheated Woman In Ntr District

Black Magic : చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని మోసం…

B.S.Chandra HT Telugu
Aug 07, 2022 11:34 AM IST

భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న మహిళతో పరిచయం చేసుకుని చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో జరిగింది. సోది చెప్పే మనిషి మాటలు నమ్మి నగదు మూటజెప్పిన మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకున్నారు.

చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ మోసం
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ మోసం (HT_PRINT)

మంత్ర తంత్రాలతో చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికిస్తానంటూ ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని ఎన్టీఆర్‌ జిల్లా పోెలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుగంచి ప్రోలు మండలం తోటచర్లకు చెందిన కోండ్రు సుధాకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో మూడు నెలల క్రితం చనిపోయాడు. భర్త చనిపోవడంతో భార్య రమణమ్మ తీవ్ర వేదను గురైంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన పస్తం రెడ్డయ్య అనే వ్యక్తి గ్రామంలో సోది చెప్పడానికి వచ్చాడు. అతనితో సోది చెప్పించుకునే క్రమంలో అతని మాటల వలలో పడిపోయింది. తన భర్త చనిపోయిన విషయం చెప్పడంతో ఆమె నాగదోషం ఉందని భయపెట్టాడు. నాగదోషంతోనే భర్త చనిపోయాడని ఐదు వేల రుపాయలు ఇస్తే దోషం పోగొడతానని ఆమెను మభ్య పెట్టాడు. ఆమె డబ్బు ఇవ్వడంతో ఇంట్లో పూజలు నిర్వహించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆ తర్వాత తన గురువుకు చనిపోయిన వారిని బతికించే శక్తి ఉందంటూ మరొకరితో ఫోన్లో మాట్లాడించాడు. అతని మాటలు నమ్మి బాధిత మహిళ పూజలు నిర్వహించడానికి అంగీకరించింది. పూజల నిర్వహణకు రెడ్డయ్య గురువు లక్షల రుపాయలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.50వేలు చెల్లించడానికి అంగీకరించింది. సోది చెప్పేందుకు వచ్చిన వ్యక్తికి రూ.20వేలు ఇవ్వడంతో ఆషాఢం తర్వాత పూజలు ప్రారంభిస్తానని చెప్పి మాయమాయ్యాడు. ఆ తర్వాత పూజలు చేస్తానని చెప్పిన వ్యక్తితో రమణమ్మ పలుమార్లు ఫోన్లో మాట్లాడింది. ఆషాఢం వెళ్లిపోవడంతో పూజలు చేయాలని మహిళ ఒత్తిడి చేయడంతో రెడ్డయ్య శనివారం గ్రామానికి వచ్చాడు.

రెడ్డయ్య వైఖరి గమపిస్తున్న గ్రామస్తులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడు తనకేమి తెలయదని తన గురువు చెప్పిన ప్రకారం చేశానని చెప్పాడు. బాధిత మహిళ జరిగిన మోసాన్ని పోలీసులకు వివరించడంతో నిందితుడు మహిళ దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో కేసు నమోదు చేయలేదు. మరోవైపు చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని మోసం చేసిన రెడ్డయ్య గురువును గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. నిందితుడు పేరు గోపి అని రెడ్డయ్య అతని శిష్యుడిగా గుర్తించారు. ఇద్దరు కలిసి గ్రామాల్లో అమాయక మహిళల్ని గుర్తించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

మాటల కనికట్టుతో మోసాలకు పాల్పడే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులు, జ్యోతిష్యులు చెప్పే మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

WhatsApp channel

టాపిక్