TDP BJP Alliance : చంద్రబాబు ఆశలపై నీళ్లు… పొత్తుపై బీజేపీ నిరాసక్తత
TDP BJP Alliance తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ నిరాసక్తత ప్రదర్శిస్తోంది. ఎన్నికల పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాలకు కూడా ప్రధాని మోదీ బ్రేకులు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న మోదీ, ఆంధ‌్రప్రదేశ్‌లో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ నాయకులు కృషి చేయాలని తేల్చి చెప్పారు.
TDP BJP Alliance బీజేపీతో పొత్తుపై గంపెడాశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు పని చేయాలని స్పష్టత నిచ్చారు. పార్టీలతో పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో చూసుకోవచ్చని ఇప్పుడు మాత్రం సొంతంగా పార్టీని మండల స్థాయి, నియోజక వర్గ స్థాయి, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ట్రెండింగ్ వార్తలు
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో ఒకరిద్దరు నాయకులు వైసీపీపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. బీజేపీతో వైసీపీ కలసి సాగుతుందనే అబిప్రాయం రాష్ట్ర ప్రజానీకంలో ఉందని, బీజేపీకి.. వైసీపీ దగ్గర అనే అభిప్రాయాన్ని కలిగేలా వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తున్నారని ప్రధానికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు ఈ అభిప్రాయం వ్యక్తం చేయడంతో స్పందించిన ప్రధాని దానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎవరిదని నేతల్ని నిలదీశారు.
వైసీపీపై పోరాడాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వానిదేనని, అదే సమయంలో ఎన్నికల పొత్తులపై ఆలోచించకుండా పనిచేయాలని పార్టీ కోర్ కమిటీ నాయకులకు స్పష్టత నిచ్చారు. టీడీపీతో పొత్తు విషయాన్ని కొందరు నేతలు పరోక్షంగా ప్రస్తావించినా ప్రధాని మోదీ ఎలాంటి స్పందన ఇవ్వలేదని చెబుతున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి క్రీడా పోటీల నిర్వహణ, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించడం, గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం వంటి పలు సూచనలు చేసిన ప్రధాని, పొత్తులతో సంబంధం లేకుండా పని చేయాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా గ్రూపుల్ని పార్టీని బలోపేతం చేయడానికి వాడుకోవాలని మోదీ సూచించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీతో సాన్నిహిత్యం కోసం వైసీపీ వెంపర్లాడుతోందని కొందరు నాయకులు ఫిర్యాదు చేయడంతో, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పోరాటాలు చేయాలని ప్రధాని సూచించినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు 19నెలల గడువు ఉండటంతో పొత్తుల విషయంపై చర్చలు ఇప్పుడే అనవసరమని తేల్చేశారట
చంద్రబాబు మీద నమ్మకం లేకే…..
టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు చేదు అనుభవాలు ఉండటంతో బీజేపీ తెలుగు దేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నాయకులు చేస్తున్న రాయబార ప్రయతనాలకు బీజేపీ అగ్ర నాయకత్వం సానుకూలత వ్యక్తం చేయడం లేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరైనా భవిష్యత్తులో నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందో లేదోననే అనుమానం ఉంది.
చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తారుమారైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో వైసీపీ కూడా కేంద్రంలో ఏర్పాడే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీ నాయకులకు తీవ్రమైన వ్యతిరేకత ఉండటమే దీనికి కారణం. మోదీ, అమిత్‌షాలతో పాటు జగన్మోహన్‌రెడ్డి, విజయసాయి రెడ్డిలు కాంగ్రెస్ రాజకీయాలతో కేసులు ఎదుర్కొన్న అనుభవాలున్నాయి. వైసీపీని బీజేపీ దగ్గర తీయడం వెనుక ఉమ్మడి శతృత్వం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో అమిత్‌షాను జైలుకు పంపడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది.
జగన్మోహన్ రెడ్డి, సాయిరెడ్డిలు కూడా 16 నెలల జైలును అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ మీద బహిరంగంగా చెప్పకపోయినా వైసీపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ కారణాలతోనే బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగడానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ సొంతంగా ఎదిగే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అందుకే పొత్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సొంతంగా ఎదగాలని ప్రధాని మోదీ పార్టీ నేతల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.