Early Polls In Andhra:ఏపీలో ముందస్తు ఎన్నికలపై బీజేపీ అనుమానాలు…?-bjp thinks that andhra pradesh cm jagan mohan reddy may go for early polls for state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Thinks That Andhra Pradesh Cm Jagan Mohan Reddy May Go For Early Polls For State

Early Polls In Andhra:ఏపీలో ముందస్తు ఎన్నికలపై బీజేపీ అనుమానాలు…?

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 09:39 AM IST

Early Polls In Andhra ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా, ప్రత్యర్థులను కట్టడి చేయడానికి అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తోందనే అనుమానాలు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లోనే ఏపీ సర్కారు ఎన్నికలకు వెళ్లొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్(ఫైల్ ఫొటో)
సీఎం జగన్(ఫైల్ ఫొటో) (facebbok)

Early Polls In Andhra ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీ గడువుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుందనే అనుమానాలు ప్రతిపక్షాల్లో ఉంది. ప్రత్యర్థులు సిద్దమయ్యేలోపు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వాటి అవకాశాలకు గండి కొట్టాలనే ప్రయత్నాలు చేస్తుందనే అనుమానం పార్టీలకు ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విడివిడిగా జరగొచ్చనే అనుమానం బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. లోక్ సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్-మే నెలల్లోనే జరిగినా అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్లు ముందుగానే జరగొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గతంలో కూడా జరిగింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్ని నిర్వహించాలనే ప్రతిపాదన జరిగినపుడు కేంద్ర ప్రతిపాదనకు ఏపీ సానుకూలంగా స్పందించిందని కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే బీజేపీయేతర ప్రబుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. జమిలీ ఎన్నికలకు అమోదం తెలుపలేదు.

గత రెండేళ్లుగా ఈ ప్రతిపాదన పలుమార్లు చర్చకు వచ్చిన ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జమిలీ ఎన్నికల వ్యవహారం మరుగునపడిపోయింది. అనూహ్యంగా ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చనే అనుమానం బీజేపీకి వచ్చింది. ఎన్నికల పొత్తులు, సర్దుబాట్ల విషయంలో ఇప్పటికీ రాజకీయ పార్టీల మధ్య క్లారిటీ రాకపోవడం, ఎన్నికలకు బాగా సమయం ఉన్నందున ప్రతిపక్ష పార్టీలు రిలాక్స్‌ అవుతున్నాయనే ఆలోచన వైసీపీకి ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల కంటే ఆర్నెల్ల ముందే వైసీపీ ఎన్నికలకు వెళుతుందని బీజేపీ ఎంపీ ఒకరు అంచనా వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం, గృహ సారథుల నియామకం వంటి కార్యక్రమాలతో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైపోయిందని, మరోవైపు రాజధానుల విషయంలో ఆ పార్టీ ఆలోచనల్ని ఆచరణల్ని పెట్టలేకపోవడం, కోర్టు వివాదాల నేపథ్యంలో జనంలోనే తేల్చుకునే ప్రయత్నం చేస్తుందంటున్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష పార్టీలకు కూడా తగినంత సమయం లభించదని అది తమకు లాభిస్తుందనే భావన వైసీపీకి ఉందని బీజేపీ నాయకుడు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో రాజకీయ పొత్తు ఉండదని ఇప్పటికే వైసీపీ ప్రకటించిందని, మిగిలిన పార్టీల్లో ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకోవాలనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు కూడా ఉండొచ్చని అంచనా వేశారు. సాధారణ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కనీసం ఆర్నెల్లు గ్యాప్ ఉండొచ్చని, ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డు కట్ట వేయడంతో పాటు ఆర్ధికపరమైన కారణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటాయని విశ్లేషించారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రత్యక్ష నగదు బదిలీతో ముడిపడి ఉన్నవే కావడం, వాటిని అమలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు కూడా ముందస్తు ఎన్నికలకు ఓ కారణమై ఉండొచ్చన్నారు. వైసీపీ వర్గాలు మాత్రం ముందస్తు ఎన్నికలు ఊహాగానాలేనని కొట్టి పారేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో ఎవరికి తెలిసే అవకాశాలు లేనందున ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని మాత్రం చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల అమోదం కూడా అవసరమేనని చెబుతున్నారు. బీజేపీతో వైసీపీకి నేరుగా ఎలాంటి పొత్తు లేకపోయినా రాజకీయ అవగాహన మాత్రం మెండుగా ఉందని గుర్తు చేస్తున్నారు.

WhatsApp channel

టాపిక్