వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి.. గోదావరి గర్జన సభలో జేపీ నడ్డా -bjp national president jp nadda fiers on ycp govt over party meeting at rajamahendravaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి.. గోదావరి గర్జన సభలో జేపీ నడ్డా

వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి.. గోదావరి గర్జన సభలో జేపీ నడ్డా

HT Telugu Desk HT Telugu
Jun 08, 2022 06:46 AM IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో వైసీపీ సర్కార్ పోవాలని... బీజేపీ రావాలంటూ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

<p>జేపీ నడ్డా</p>
జేపీ నడ్డా (twitter)

రాష్ట్రంలో శాంతి భద్రతలను దిగజార్చి... నిధులను పక్కదోవ పట్టిస్తున్న వైసీపీ సర్కార్ ను గద్దె దించాలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన గోదావరి గర్జన భలో పాల్గొన్న ఆయన.. వైసీపీతో పాటు టీడీపీపై తనదైన విమర్శలు గుప్పించారు.

ఆర్థిక క్రమశిక్షణ లేని వైసీపీ ప్రభుత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు నడ్డా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తోందని, పంచాయతీ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. ఈనేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపైనే ఓటు వేయాలని, మోదీ సుపరిపాలన రాష్ట్రానికీ తేవాలని పిలుపునిచ్చారు. 2014లో మోదీ ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ కాలదన్నుకుందనీ, వారినీ కూడా వచ్చే ఎన్నికల్లో సాగనంపాలన్నారు.

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్న జేపీ నడ్డా... ప్రార్థనా స్థలాలపై దాడులు ఎక్కువయ్యాయని విమర్శించారు. ప్రతీకార చర్యలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకా... ప్రగతి పరుగులు పెడుతోందని చెప్పుకొచ్చారు. అవినీతి రహిత అభివృద్ధిలో ప్రపంచానికే మార్గదర్శకంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

సంక్షోభంలోకి నెట్టేశారు - సోము వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు పెరిగాయని.. మహిళలకు భద్రత లేదని దుయ్యబట్టారు. మోదీ ఆధ్వర్యంలోని కేంద్రంలో అవినీతి లేదని స్పష్చం చేశారు. ఏపీలోనూ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తామని వెల్లడించారు. పోలవరం పూర్తికాకపోవడానికి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు.

వైసీపీ కౌంటర్...

జేపీ నడ్డా వ్యాఖ్యలపై వైసీపీ నుంచి రీసౌండ్ గట్టిగానే ఉంది. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఏం మేలు చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. పవిత్ర గోదావరి తీరాన పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? మీది చేతగాని ప్రభుత్వమా? అని సూటిగా ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జన్‌ ధన్‌ ఖా తాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. ఒక్కరి ఖాతాలోనైనా జమ చేశారా? రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా హామీ ఏమైంది? విభజన చట్టం 13వ షెడ్యూలులో అంశాలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని దుయ్యబట్టారు.

Whats_app_banner