బీజేపీ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన జారిపడటంతో కూడి చేయి విరిగింది. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను.. మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి.
'సుజనా చౌదరికి నిన్న లండన్‌లో ప్రమాదం జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి స్వల్ప గాయమైంది. అనంతరం ఆయన హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కూటమి కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దు' అని సుజనా చౌదరి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2010లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2019కి ముందు టీడీపీ నుంచి బీజేపీలోకి మారారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
సంబంధిత కథనం