CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పిలుపు
CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని, బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాకుండా... ప్రజల కోసం పనిచేసేవారికి ఓటేయాలని బాబు ఓటర్లకు సూచించారు.
CBN In Delhi: ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్ కడితే ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం చేపట్టారని, ప్యాలెస్‌లోకి అడుగుపెట్టక ముందే జగన్‌ను ఏపీలో చిత్తుగా ఓడించారని... ఇక్కడా అదే జరగాలని, ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారు ఏకపక్షంగా బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిజెపి అభ్యర్థి సంజయ్ గోయల్‌కు ఓటేయాలని ఓటర్లకు సూచించారు.
పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయిందని దేశం మొత్తం స్వచ్ఛ భారత్‌లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంలోకి వెళ్లిపోతోందన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉందని 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉందని అభివృద్ధి రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ ఆక్సీజన్ కావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపున తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
బీజేపీ గెలుపులో తెలుగువారు భాగమవ్వాలి
‘ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉంటారని అనుకోలేదని ఢిల్లీలో స్థిరపడ్డ ప్రతి తెలుగు ఓటరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని తెలుగువారు ఢిల్లీలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇది భారతీయులు, తెలుగువారి సత్తా. పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్లినప్పుడు 650 మంది అక్కడ ఉన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను... ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీలోని ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు తమ్ముళ్లు, చెళ్లెల్లు ఇంటింటికెళ్లి బీజేపీ గెలుపు.. దేశ చరిత్రకే ఒక మలుపు అని చెప్పాలని సూచించారు.
దేశానికి యువత పెద్ద ఆస్తి అని సరైన సమయంలో మన దేశానికి సరైన నాయకుడిగా మోదీ ఉన్నారని మన దేశ బ్రాండ్ మార్మోగడానికి కారణం ప్రధాని మోదీ. 11 ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణల్లో దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా 2047 కల్లా దేశం నెంబర్ వన్ అవుతుందన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి ఉండుంటే వాషింగ్టన్, న్యూయార్క్‌ను ఢిల్లీ తలదన్నేదని ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి చాలామంది హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలని చూస్తున్నారు. దీనికి కారణం ఇక్కడి పాలకులు అని ఆరోపించారు.
మురికి కూపంగా ఢిల్లీ
‘ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. ఈ దేశానికి రాజధాని అయిన ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పదేళ్లు ఏం చేశారని అడిగితే స్కూళ్లు పెట్టామన్నారు. చదివిన వారికి ఉద్యోగాలు వచ్చాయా..? ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లడానికి కారణం ఇక్కడి పాలకులు. దేశం స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తుంటే.. ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారుతోందన్నారు. సరైన నీటి పైపులైన్లు లేక తాగునీరు కలుషితమౌతోంది. ఒక్కప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి ఉపాధికి వచ్చేవారు... కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశం వెళ్తున్నారు. అభివృద్ధి జరిగిన చోటకు వలసలు ఉంటాయన్నారు.
బీజేపీ గెలిస్తేనే సంక్షేమ ఫలాలు
‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్ధిక సాయం అందిస్తుంది. హోలీ, దీపావళి పండుగకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రూ.500కు సిలిండర్ అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా పేదల వైద్యం కోసం రూ.5 లక్షలు, వృధ్యాప్య పెన్షన్లు రూ.2,500, వితంతువు, దివ్యాంగులకు రూ.3 వేలు ఇస్తుంది. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తుంది. గరీబ్ కళ్యాణ అన్న కింద 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తుందని చెప్పారు.
ప్యాలెస్‌లు కట్టుకునే వారు పాలకులుగా వద్దు
‘ఢిల్లీ వాసులకు తాగునీరు అందించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని అమృత్ కింద ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు మోదీ సంకల్పించారని కేంద్రం ఇచ్చే సబ్సీడీని కూడా అసమర్ధ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. అధికారంలో బీజేపీ ఉండుంటే మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా ఉంటుంది. యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రివాల్ ప్రగల్భాలు పలికారు...పదేళ్లులో చేయలేని వారు ఇప్పుడు చేస్తారా.? మోదీ నాయకత్వంలో గంగానది ప్రక్షాళన జరుగుతోందన్నారు.
ప్యాలెస్‌లోకి ప్రవేశించకముందే చిత్తుగా ఓడించండి
‘ఏపీలో రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్‌లోకి ప్రవేశించేలోపే జగన్ ఇంటికి వెళ్లారని ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ బ్రహ్మాండమైన శేషమహల్ కట్టారు. ఆ శేషమహల్‌లోకి ప్రవేశించడానికి ముందే మీరుచిత్తుగా ఓడించాలి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అన్నారు. ఒకప్పుడు దేశ విభజనను సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అడ్డుకుని ఏకం చేశారు. అటువంటి గట్టి నాయకుడు మోదీ టీం ఇండియా నినాదంతో ప్రపంచంలో నెంబర్ వన్‌గా చేయాలని పని చేస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి. మీకు అండగా, తోడుగా నేనుంటా.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.