US Citizenship: ట్రంప్ వద్దంటే డోంట్ వర్రీ... జన్మత: అమెరికా పౌరసత్వం సమస్య కానేకాదు.. చాలా దేశాల్లో ఉన్నదే…-birth right citizenship citizenship is not an issue more income comes from the gulf than the us ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Us Citizenship: ట్రంప్ వద్దంటే డోంట్ వర్రీ... జన్మత: అమెరికా పౌరసత్వం సమస్య కానేకాదు.. చాలా దేశాల్లో ఉన్నదే…

US Citizenship: ట్రంప్ వద్దంటే డోంట్ వర్రీ... జన్మత: అమెరికా పౌరసత్వం సమస్య కానేకాదు.. చాలా దేశాల్లో ఉన్నదే…

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 27, 2025 05:00 AM IST

US Citizenship: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జన్మతా: పౌరసత్వం తీసుకున్న నిర్ణయం ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకుంటున్న వారి కలలపై నీళ్లు చల్లింది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం కష్టమే అయినా దాంతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయనే వాదన కూడా ఉంది.

ట్రంప్‌ ఆంక్షలపై ఆందోళన అనవసరం
ట్రంప్‌ ఆంక్షలపై ఆందోళన అనవసరం (AP)

US Citizenship: అమెరికాలో జన్మించే వారికి పుట్టుకతో లభించే పౌరసత్వ హక్కును రద్దు చేయాలన్న అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయ ప్రవాస భారతీయుల్లో కలకలం రేపుతోంది. జనవరి 20న అమెరికా అధ‌్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో బర్త్‌ రైట్ సిటిజన్‌ షిప్‌ కోసం అమెరికా రాజ్యాంగంలో చేసిన 14వ సవరణ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు.

yearly horoscope entry point

దీనిపై ఇప్పటికే న్యాయ స్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. మరోవైపు సరైన పత్రాలు, తిరుగు ప్రయాణం టిక్కెట్లు లేకుండా అమెరికాలో అడుగు పెడుతున్న వారిని బలవంతంగా వారి స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. అక్రమ వలసల్ని నిరోధించే క్రమంలో అమెరికా నూతన అధ్యక్షుడు ఆంక్షలు విధించడం ఇప్పటికే మొదలైంది. మరోవైపు ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలోగా పిల్లల్ని కనేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ఎందుకీ ఆందోళన…

అమెరికాలో ఆంక్షలు మొదలు కాబోతున్న వేళ ఆ దేశంలో భవిష్యత్తును వెదుక్కుంటూ వెళుతున్న వారు, ఇప్పటికే వెళ్లిన వారు, శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆందోళన నెలకొంది.ఈ క్రమంలో అసలు అమెరికాలో ఎంత మంది తెలుగు వారు ఉంటారు, వారిలో శాశ్వత నివాస హక్కులు ఉన్నా వారు ఎందరు, పౌరసత్వం ఉన్న వారెంత మంది, తాజా ఉత్తర్వుల ప్రభావానికి గురయ్యే వారు ఎందరు అనే చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ట్రంప్‌ నిర్ణ‍యం ఆందోళనకరమే అయినా కలత చెందాల్సిన అవసరం లేదని ప్రవాస తెలుగు సంఘాలు చెబుతున్నాయి.

అమెరికా కంటే ఎక్కువ గల్ఫ్‌లోనే..

ట్రంప్ తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున కలకలం రేగినా వాస్తవానికి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, ప్రవాస తెలుగు ప్రజల కంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న వారే అధికంగా ఉంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది తెలుగు ప్రజలు ఉంటారనే దానిపై స్పష్టమైన గణంకాలు లేకపోయినా అన్ని దేశాల్లో కలిపి దాదాపు 27-30లక్షల మంది తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉండొచ్చని టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన రాజశేఖర్‌ వివరించారు.

ట్రంప్ తాజా నిర్ణయం అమలు కావడంపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నా దానిపై భయాందోళనలు అవసరం లేదని ప్రవాస తెలుగు సంఘాలు చెబుతున్నాయి. రివర్స్‌ మైగ్రేషన్‌ అన్ని దేశాల్లో ఉంటున్నదే కాబట్టి స్పష్టమైన అవగాహనతోనే విదేశాలకు వెళ్లడం ఉత్తమం అని ఆయన సూచిస్తున్నారు.

పునరాలోచన బెటర్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో స్థిరపడిన వారి కంటే ఎక్కువగా గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న వారు అధికంగా ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ద్వారా ఏటా 30వేల కోట్ల రుపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం భారత్‌కు లభిస్తోంది. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చే భారత్‌కు వచ్చే ఆదాయంతో పోలిస్తే గల్ఫ్‌ దేశాల నుంచి లభించే ఆదాయమే ఎక్కువ ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాలు వివరిస్తున్నారు.

అమెరికాలో ట్రంప్‌ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధన గల్ఫ్‌ దేశాల్లో మొదటి నుంచి ఉన్నదేనని, అక్కడ శాశ్వత పౌరసత్వం లభించే విధానాలు లేవని గుర్తు చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లడం, చేసినన్ని రోజులు పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చేయడం ద్వారా మాతృభూమికి మేలు జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. వారు సంపాదించిన దాంతో ఇక్కడ విదేశీ మారకంతో పాటు స్థానిక అభివృద్ధిలో భాగం అవుతున్నారని గుర్తు చేస్తున్నారు

అమెరికా పౌరసత్వం మూడో వంతు మందికే…

ప్రస్తుతం అమెరికాలో కాస్త అటుఇటుగా పదిలక్షల మంది తెలుగు ప్రజలు ఉంటే, గల్ఫ్‌ దేశాల్లో 12-14లక్షల మంది పనిచేస్తున్నారు. యూకేలో లక్షన్నర మంది, యూరోప్‌లో 2-3లక్షల మంది, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ దేశాల్లో రెండు లక్షల మంది, దక్షిణాసియా దేశాలైన సింగపూర్‌, మలేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో 2-3లక్షల మంది ఉండొచ్చనే అంచనా ఉంది.

ప్రస్తుతం అమెరికాతో, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా దాదాపు 38దేశాల్లో శాశ్వత పౌరసత్వం మంజూరు చేసే విధానం అమల్లో ఉంది. సింగపూర్‌లో కేవలం పర్మనెంట్ రెసిడెంట్ హోదా మాత్రమే లభిస్తుంది. పౌరసత్వం లభించదు. గల్ఫ్‌ దేశాల్లో మొదట్నుంచి పౌరసత్వం ఇచ్చే విధానం లేదు.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తెలుగు వారిలో కేవలం రెండున్నర లక్షల్లోపే శాశ్వత పౌరులు ఉంటారు. మిగిలిన వారంతా హెచ్‌1బి వీసాలు, స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్‌ వీసాలు, అక్రమ వలసదారులు ఉంటారు. గత ఐదేళ్లలో సాలీనా ఏటా 50వేల మందికి పైగా ఉన్నత విద్య కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లారు. వీరంతా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వర్క్‌ పర్మిట్‌‌ల కోసం ప్రయత్నాల్లో ఉన్నవారే లక్షల్లో ఉంటారు. డాలర్ల వేటలో అప్పులు చేసి వెళ్ళిన వారంతా ఎప్పుడేమి జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు.

మరోవైపు హెచ్‌1బి వీసాతో అమెరికా వెళ్లిన వారిలో సైతం 15-20ఏళ్లకు పైగా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారని టీడీపీ ఎన్నారై విభాగానికి చెందిన రాజశేఖర్‌ వివరించారు. ఏదో ఒక రోజు అమెరికా పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఉన్న వారికి తాజా పరిణామాలు ఇబ్బందికరంగానే ఉంటాయని వివరించారు.

ఆందోళన అనవసరం... స్వాగతించడానికి మాతృభూమి ఎప్పుడూ రెడీ

రకరకాల కారణాలతో అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనతో అక్కడకు వెళ్లిన వారికి ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన అవసరమని మాతృభూమికి తిరిగి వెళ్లడానికి ఎప్పుడూ ఎలాంటి సమస్యలు ఉండవని ప్రవాస తెలుగు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా పౌరసత్వ విధానాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఆ దేశ చట్టాలను అక్కడకు వెళ్లే వారు గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయం పూర్తి స్థాయిలో అమలైతే అది ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. శాశ్వత వలసలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వదేశంలో, మాతృభూమిలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ దశలో ఉంది. పెట్టుబడుల్ని, మేధో వలసలు అనివార్యమైతే అమెరికా నుంచి తిరిగి వచ్చే యువశక్తిని సరైన విధంగా వాడుకోడానికి ప్రణాళికలు అవసరమనే అభిప్రాయాలు ఉన్నాయి. పెట్టుబడుల్ని ఆహ్వానించేలా రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తే అది ఏపీకి ఉపయోగపడొచ్చని వివరిస్తున్నారు.

ప్రస్తుతం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి పోతున్న వారితో వారి సంపద కూడా ఆ దేశాల్లోనే ఉండిపోతోంది. ఆ డబ్బును పెట్టుబడుల రూపంలో ఆకర్షించగలిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే అభిప్రాయం ప్రవాస తెలుగు సంఘాలు చెబుతున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం ప్రవాసాంధ్రుల్లో భరోసా కల్పించి వారిని ఆకర్షించగలిగితే కొంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం