Bird Flu Effect : ఆ రెండు మండలాల్లో చికెన్‌ఫై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్, తగ్గిన అమ్మకాలు, ఆందోళన వద్దన్న ప్రభుత్వం
Bird Flu Effect : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలపై ఎఫెక్ట్ పడగా, తాజాగా కృష్ణా జిల్లాకు వైరస్ వ్యాపించింది. బర్డ్ ఫ్లూ నమోదైన ప్రాంతంలో 10 కి.మీ పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Bird Flu Effect : ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం మండలంలోని కోళ్లకు వైరస్ నిర్థారణ అయ్యింది. ఈ మండలంలో 2 రోజుల్లోనే 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకి చనిపోయిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు పౌల్ట్రీ నిర్వాహకులను ఆదేశించారు.
ఈ మండలం చుట్టుపక్కల 10 కి.మీ పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు వెటర్నరీ అధికారులు సూచించారు. అయితే 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వివరణ ఇచ్చారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు.
భారీగా తగ్గిన చికెన్, గుడ్లు ధరలు
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు అంచనా. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్థారణ అయ్యింది. ఈ మండలంలో కూడా గుడ్లు, చికెన్ అమ్మకాలు నిలిపివేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ భయం, అధికారుల హెచ్చరికలతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కేజీ రూ.220 వరకు పలికిన ధరలు, మంగళవారానికి రూ.150- రూ.170కి తగ్గాయి. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవడంలేదు.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినొద్దని సూచించారు. ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించదని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చికెన్‌ను 20 నిమిషాల పాటు ఉడికిస్తుంటాం. అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతారు. ఈ ఉష్ణోగ్రతలో వైరస్ బతికే అవకాశం లేదని చెబుతున్నారు. పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లతో సమస్య ఉండదని చెప్పారు.
ఏపీ కోళ్లను వెనక్కి పంపుతున్న తెలంగాణ అధికారులు
ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదుతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఏపీ నుంచి వచ్చే కోళ్ల లారీలను తెలంగాణ అధికారులు సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. మంగళవారం ఏపీ నుంచి వచ్చిన రెండు కోళ్ల లారీలను అడ్డుకుని తిప్పి పంపించారు. సోమవారం కూడా ఐదు లారీలను వెనక్కి పంపించామని ఉండవల్లి ఎస్‌ఐ మహేశ్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో అలర్ట్..
ఏపీలో బర్డ్ ఫ్లూ బారిన పడి కోళ్లు చనిపోతుండటంతో తెలంగాణ పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌పిఏఐ కేసులు నిర్ధారణ కావడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమలో అవగాహన చర్యలు చేపట్టాలని, వ్యాధి నిరోధక చర్యలు చేపట్టాలని, రోగ లక్షణాలు ఉన్న కోళ్లను గుర్తించాలని సూచించారు. పౌల్ట్రీల్లో అనూహ్యంగా నమోదయ్యే కోళ్ల మరణాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సంబంధిత కథనం