Bhumana Karunakar: చిత్తశుద్ధిలేని వ్యక్తులకు టీటీడీ పగ్గాలిచ్చారని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Bhumana Karunakar: తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేసి, చిత్తశుద్ధి, నిజాయితీ లేని వ్యక్తులకు టీటీడీ పగ్గాలిచ్చారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bhumana Karunakar: తిరుపతి తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని ఆరోపించారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని, భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు.
ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారని గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో ఆరుగురు మరణించడం సాధారణమైన విషయం కాదని టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు అన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని, ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప ఆయనకు ఏమీ పట్టవని భూమన ఆరోపించారు. గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమేనని, హిందూ ధర్మంమీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి, వాటిని తేలిగ్గా చూడ్డంవల్లే ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు.
తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందని, వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి ఉందని ఆరోపించారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదని అధికారుల మధ్య, పోలీసుల మధ్య సమన్వయం లేదన్నారు.
శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువని, ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమేనన్నారు. టీటీడీ ఛైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని, తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు.
తిరుపతికి చేరిన ఏపీ మంత్రులు…
తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అప్పటికప్పుడు అమరావతి నుండి తిరుపతికి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అప్పటికప్పుడు తిరుపతి బయల్దేరారు.
మరోవైపు తిరుపతి ఘటనపై మంత్రి ఆనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర సహాయక చర్యలకు సిఎం చంద్రబాబు ఆదేశించారు. సహాయ చర్యలపై పర్యవేక్షణ కోసం దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతికి బయల్దేరి వెళ్లారు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు. పండుగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ పోలీసు అధికారులతో మంత్రి ఆనం సమీక్షిస్తున్నారు.
సంబంధిత కథనం