BHEL Paper Leak : భెల్‌లో సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పేప‌ర్ లీక్‌, విశాఖలో వెలుగుచూసిన ఘటన-bhel supervisor trainee engineer paper leaked incident came to light in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bhel Paper Leak : భెల్‌లో సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పేప‌ర్ లీక్‌, విశాఖలో వెలుగుచూసిన ఘటన

BHEL Paper Leak : భెల్‌లో సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పేప‌ర్ లీక్‌, విశాఖలో వెలుగుచూసిన ఘటన

HT Telugu Desk HT Telugu

BHEL Paper Leak : విశాఖ బీహెచ్ఈఎల్ సూపర్ వైజర్ ట్రైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్ లైన్ పరీక్ష పేపర్ ను లీక్ చేశారు. డబ్బులు తీసుకుని ప్రశ్నా పత్రాలు లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో సంచలనం రేగింది.

భెల్‌లో సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పేప‌ర్ లీక్‌, విశాఖలో వెలుగుచూసిన ఘటన

BHEL Paper Leak : విశాఖ‌ప‌ట్నం భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (భెల్)లో సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీ చేసే ఆన్‌లైన్ ప‌రీక్ష పేప‌ర్‌ను లీక్ చేశారు. డ‌బ్బులు తీసుకుని ప‌రీక్షకు సంబంధించిన ప‌త్రాల‌ను లీక్ చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోని సంచ‌ల‌నం అయింది.

ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా పెందుర్తి స‌మీపంలో జియోన్ టెక్నాల‌జీస్ కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం భెల్‌లో సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీ కోసం జియోన్ టెక్నాల‌జీస్ ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వహించింది. శుక్రవారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ ప‌రీక్షకు విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, పార్వతీపురం మ‌న్యం, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, అల్లూరి సీతారామ‌రాజు జిల్లా, కాకినాడ‌, తూర్పుగోదావ‌రి, బి.ఆర్ అంబేడ్కర్ కోన‌సీమ, ప‌శ్చిమ‌గోదావ‌రి, ఏలూరు జిల్లాల‌కు చెందిన అభ్యర్థులు హాజ‌ర‌య్యారు.

20 నిమిషాల్లో పేపర్ ముగించడంతో

అయితే ప‌రీక్ష కేంద్రంలో ప్రశ్నాప‌త్రంతో పాటు స‌మాధానాల‌ను ముందే కొంత మంది అభ్యర్థుల‌కు లీక్ చేశారు. ప‌రీక్ష జ‌రుగుతున్న స‌మ‌యంలో వేర్వేరు రూమ్‌ల్లో ముగ్గురు అభ్యర్థులు రెండు గంట‌ల పాటు ఆన్‌లైన్‌లో రాయాల్సిన ప‌రీక్షను కేవ‌లం 20 నిమిషాల్లోనే ముగించారు. దీంతో తోటి అభ్యర్థుల‌కు అనుమానం వ‌చ్చి వారిని నిల‌దీశారు. ఆ ముగ్గురు అభ్యర్థుల వ‌ద్ద ఉన్న అడ్మిన్ కార్డు వెనుక మైక్రో జెరాక్స్ ద్వారా తీసిన జ‌వాబులు క‌నిపించ‌డంతో మిగిలిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌రీక్ష జ‌రుగుతుండ‌గానే నిర్వాహ‌కుల‌ను నిల‌దీశారు.

మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన అభ్య‌ర్థుల వ‌ద్ద జ‌వాబు ప‌త్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంత‌రం ప‌రీక్ష కేంద్రం ఎదుట అభ్యర్థులంతా ఆందోళ‌న‌కు దిగారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని, ప‌రీక్షను త‌క్షణ‌మే ర‌ద్దు చేయాల‌ని నినాదాల హోరెత్తించారు. కాగా, ఈ కేంద్రంలో జ‌రుగుతున్న వ్యవ‌హారాల‌పై ఇప్పటికే పోలీసుల‌కు ప‌లు ఫిర్యాదులు అందాయి. మార్చి 25న ఇదే ప‌రీక్షా కేంద్రంలో జ‌రిగిన ఏపీపీఎస్‌సీ ఏఈఈ ప‌రీక్షలో నిర్వాహ‌కులు అవినీతికి పాల్పడి కొంద‌రు అభ్యర్థుల‌కు పూర్తి స‌హ‌కారం అందించారని రాష్ట్ర విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌కు కొంత మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. తాజాగా మ‌ళ్లీ అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

అభ్యర్థులకు బెదిరింపులు

మ‌రోవైపు మాస్ కాపీయింగ్‌ వ్యవ‌హారం బ‌య‌ట‌ప‌డ‌టంతో ప‌రీక్ష నిర్మాహ‌కులు న‌ష్ట నివార‌ణ చ‌ర్యలకు దిగారు. సాయంత్రం ప‌రీక్ష ముగించుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్న అభ్య‌ర్థుల‌ను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోప‌ల ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పాల‌ని బెదిరించారు. లోప‌ల జ‌రిగిన విష‌యం బ‌య‌ట‌కు చెబితే పోలీసుల‌తో కేసులు పెట్టించి, ఉద్యోగాలు రాకుండా చేస్తామ‌ని బెదిరించిన‌ట్లు అభ్యర్థులు తెలిపారు.

మాస్ కాపీయింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ముగ్గురు అభ్యర్థుల‌ను నిర్వాహ‌కులు ముందుగానే పంపించేశార‌ని పోలీసులకు అభ్యర్థులు స‌మాచారం అందించారు. ఈ వ్య‌వ‌హారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల‌ను ప‌రిశీలించి ద‌ర్యాప్తు ప్రారంభించారు. పెందుర్తి ఎస్ఐ రెడ్డి అసిరితాత ప‌రీక్షా కేంద్రం వ‌ద్దకు చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. బాధ్యుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని, ఈ ప‌రీక్ష మ‌ళ్లీ జ‌ర‌పాల‌ని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పెందుర్తి పోలీసులకు లిఖిత‌పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం