Bhavani Deekshalu: నవంబర్ 11 నుంచి భవానీ దీక్షల ప్రారంభం,డిసెంబర్21 నుంచి విరమణ, 25న దీక్షల ముగింపు-bhavani diksha will start from november 11 end from december 21 and end on 25 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bhavani Deekshalu: నవంబర్ 11 నుంచి భవానీ దీక్షల ప్రారంభం,డిసెంబర్21 నుంచి విరమణ, 25న దీక్షల ముగింపు

Bhavani Deekshalu: నవంబర్ 11 నుంచి భవానీ దీక్షల ప్రారంభం,డిసెంబర్21 నుంచి విరమణ, 25న దీక్షల ముగింపు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 07, 2024 12:51 PM IST

Bhavani Deekshalu: బెజవాడ కనకదుర్గమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు భక్తులు చేపట్టే మండల దీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 40రోజుల పాటు జరిగే ఈ దీక్షల విరమణ డిసెంబర్ 21తో ముగుస్తాయి. డిసెంబర్ 25న పూర్ణాహూతితో భవానీ దీక్షల్ని ముగిస్తారు.

నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు
నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు

Bhavani Deekshalu: ఏటా కార్తీక మాసంలో మొదలయ్యే భవానీ దీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ దీక్షలు చేపడతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలు ధరిస్తారు. ఏటా లక్షలాది మంది భవానీ దీక్షదారులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తుంటారు. 2007 వరకు దసరా ఉత్సవాలతో పాటు భవానీ దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించే వారు. దసరా ఉత్సవాల చివరి రోజుల్లో దీక్షల విరమణ చేసేవారు. భవానీ దీక్షదారుల్ని దర్శనాలకు అనుమతించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో దసరా ఉత్సవాలో సంబంధం లేకుండా భవానీ దీక్షల్ని చేపడుతున్నారు.

ఈ ఏడాది నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నట్టు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభిస్తారు. 15వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

డిసెంబర్ 1వ తేదీన అర్థమండల దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అర్థ మండల దీక్షలు డిసెంబర్ 5న ముగుస్తాయి. డిసెంబర్ 14వ తేదీన సత్యనారాయణ పురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి అమ్మవారి కలశజ్యోతి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం ఆరున్నర నుంచి నగరోత్సోవంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. డిసెంబర్ 21వ తేదీ నుంచి దీక్షల విరమణ ప్రారంభిస్తారు. 25వ తేదీ వరకు దీక్షల విరమణ కొనసాగుతుంది. దీక్షల ముగింపు నేపథ్యంలో అగ్ని ప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షణ, భవానీ దీక్షల విరమణ చేపడతారు. డిసెంబర్ 25న ఉదయం పది గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి.

భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ తరలి రానున్న నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి 26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవల్ని రద్దు చేస్తారు. అమ్మవారికి జరిగే సేవల్ని ఏకాంత సేవలు నిర్వహిస్తారు.

కార్తీక మాసం నేపథ్యంలో మల్లేశ్వర స్వామికి ప్రతి రోజూ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, ప్రతిరోజూ మధ్యాహ్యం మూడు నుంచి ఏడు గంటల వరకు నిర్వహిస్తారు. మల్లేశ్వర ఆలయంలో జరిగే పూజలకు రూ.500 రుసుము చెల్లించి ఈ సేవల్లో పాల్గొనవచ్చు. కార్తీక సోమవారం ఏకాదశి, పౌర్ణమి సవేలు, మాస శివరాత్రి రోజుల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చన పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో పాల్గొనడానికి రూ.2వేలు చెల్లించాలి.

Whats_app_banner